టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ కూడా. అంతేకాదు భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అలాంటి లెజెండరీ ధోనీకే ఆయన సతీమణి సాక్షి క్రికెట్ రూల్స్ నేర్పించారట. ఈ విషయాన్ని స్వయంగా మహీనే వెల్లడించారు.
‘ఓరోజు నేను, సాక్షి ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. మేం టీవీ చూస్తున్నపుడు క్రికెట్ గురించి మాట్లాడుకోము. ఆ రోజు మ్యాచ్‌లో బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ షాట్ ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు రాగా.. కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. సాక్షి మాత్రం బ్యాటర్ అవుట్ కాదంది. అప్పటికే బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్లిపోతున్నాడు. అయినా కూడా అంపైర్లు అతడిని వెనక్కి పిలుస్తారని, వైడ్ బాల్‌కు స్టంపౌట్ ఎలా ఇస్తారని నాతో వాదించింది. వైడ్ బాల్‌కి స్టంపౌట్ చేయొచ్చని, నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని సాక్షికి చెప్పాను’ అని ఎంఎస్ ధోనీ తెలిపాడు.
Also Read: IND vs NZ: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు స్టార్ బ్యాటర్ దూరం?
‘నేను ఎంత చెప్పినా సరే సాక్షి వినలేదు. నీకు క్రికెట్ గురించి ఏమీ తెలియదు, ఊరుకో అంటూ నాపై చిందులేసింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత బ్యాటర్ వెనక్కి వస్తాడు అని అంటూనే ఉంది. అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోయాడు. కొత్త బ్యాటర్ కూడా క్రీజులోకి వచ్చాడు. ఏదో తప్పు జరిగింది అంటూ సాక్షి తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు. 2010లో ధోనీ, సాక్షిల వివాహం జరగగా.. వీరికి జీవా అనే కూతురు ఉంది. 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఐపీఎల్ 2025లో మహీ ఆడే అవకాశాలు ఉన్నాయి.