ప్రతీ ఏటా లాగే 2025 కూడా ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో సినిమా ప్రియులకు అసలైన విందు భోజనం దొరకబోతోంది. సాధారణంగా శుక్రవారం వచ్చే సినిమాల సందడి, ఈసారి క్రిస్మస్ పండుగ పుణ్యమా అని ఒక రోజు ముందే అంటే గురువారం నుంచే మొదలైపోతుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ఏకంగా ఎనిమిది సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. వీటిలో ముఖ్యంగా నాలుగు సినిమాలపై ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. యువ హీరో రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’, ఆది సాయికుమార్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల’, హెబా పటేల్ హారర్ చిత్రం ‘ఈషా’తో పాటు శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ‘దండోరా’ సినిమాలు తమ ప్రమోషన్స్ మరియు ఆసక్తికరమైన కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉన్నాయి. అయితే..
ఇంతటి పోటీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ యాక్షన్ సినిమా ‘మార్క్’ ప్రమోషన్ల లోటు వల్ల రేసులో వెనుకబడి కనిపిస్తున్నాయి.ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. వీటితో పాటు ‘పతంగ్’, ‘బ్యాడ్ గర్ల్స్’ వంటి చిన్న సినిమాలు వస్తున్నాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు. విడుదల తేదీల్లో జరిగిన కొన్ని మార్పుల వల్ల ఇన్ని సినిమాలు ఒకేసారి మీద పడటంతో థియేటర్ల వద్ద రద్దీ పెరగనుంది. మొత్తం మీద ఈ ఏడాది ముగింపులో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంది, మరి వీటిలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి.
