YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!

Ycp Vs Tdp Vijayawada

Ycp Vs Tdp Vijayawada

విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఈ దీక్షా శిబిరం ఏర్పాటు అనుమతి లేకుండానే జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలో దీక్షా శిబిరం టెంట్‌ను టీడీపీ శ్రేణులు తొలగించగా.. దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను నిలువరించి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.

మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని వైసీపీ దీక్షలో పాల్గొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెలి మాట్లాడుతూ… ‘మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. సీబీఐ విచారణ జరపించాలి. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి, జీవోలు తారుమారు అయ్యాయి. విద్యా శాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోలీసు అధికారులు ఆలోచించాలి. ప్రజాస్వామ్య యుతంగా చేసే పోరాటాలపై అణచివేతకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని అన్నారు.