NTV Telugu Site icon

YS Jagan: సమయం వచ్చింది.. జిల్లాల్లోనే నిద్ర చేస్తా: వైఎస్‌ జగన్‌

Ys Jagan

Ys Jagan

ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత వచ్చిందని, ఇక ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుందని, ప్రతి పార్లమెంటులో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని, వైసీపీ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే.. ఈ సారి 40 శాతం వచ్చిందని వైఎస్‌ జగన్‌ నేతలతో అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయిన జగన్‌.. నేతలకు దిశా నిర్దేశం చేశారు.

‘జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుంది. జిల్లాల్లో నేను నిద్ర చేస్తాను. ప్రతి పార్లమెంటులో ప్రతి బుధ, గురువారాల్లో నిద్ర చేస్తాను. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతాను. ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల పాలనలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం. మన పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చు. ఇచ్చిన హామీలు అమలు చేయటమే దీనికి కారణం. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అసత్య హామీలు ఇచ్చారు. మనం లబ్ది చేస్తుంటే వాళ్లు చేస్తామని అబద్దాలు చెబుతున్నారని మన పార్టీ వారు అప్పట్లో చెప్పారు. అతి నిజాయితీ, అతి మంచితనం నాలో ఉన్న సమస్య అని మన పార్టీ వాళ్లు చెప్పారు. అయితే వాటివల్లే మరలా వైసీపీ అధికారంలోకి వస్తుంది. పథకాలు ఇవ్వకుండా.. పథకాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారంట. అన్ని వర్గాలు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి’ అని నేతలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

‘మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్‌తో పాటు సంక్షేమ కేలండర్‌ను విడుదల చేసి.. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. చరిత్రలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కారణాలను పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే, ఈ సారి 40 శాతం వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అందుకే పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు. గవర్నమెంట్ బడులు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్ధితుల్లోకి నెట్టేశారు. వైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది’ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.