ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు.
రాబోయే ఎన్నికలు రెండు వర్గాలకు, రెండు కులాలకు మధ్య యుద్ధం కాదన్నారు. పల్నాడు ప్రజల కష్టాలు తీరాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి పూర్తిస్థాయిలో పనులు చేసినట్లు తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టుకి అటవీ శాఖ అనుమతులు కోసం పని చేసినట్లు వెల్లడించారు. అలాగే పల్నాడు ప్రాంతాన్ని జాతీయ రహదారులతో కలిపి రూ.3000 కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
అలాగే పల్నాడుకు కేంద్రీయ విద్యాలయాలు కూడా తీసుకొచ్చినట్లు వివరించారు. రైతుల కోసం 400 కిలోమీటర్ల డొంక రోడ్లు వేయిపించినట్లు పేర్కొన్నారు. గోదావరి నీటిని సాగర్ కుడికాలువకు తీసుకువస్తే కుడికాలువ పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు, రైతులకు మేలు కలుగుతుందన్నారు. పల్నాడు ప్రజలు మరొకసారి తనను ఆశీర్వదించాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరారు.