NTV Telugu Site icon

Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు అరెస్ట్‌!

Pinipe Srikanth

Pinipe Srikanth

Pinipe Srikanth Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో శ్రీకాంత్‌ను తమిళనాడులోని మధురైలో ఈరోజు ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు శ్రీకాంత్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు దుర్గాప్రసాద్‌ హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు నిర్ధరణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, మృతుడికి స్నేహితుడైన ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. అతడిని అక్టోబర్ 18న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మదురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేశారు.

Also Read: MP Avinash Reddy: ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయా?: అవినాష్‌ రెడ్డి

శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పంపిన కారణంగానే అతడిని హత్య చేయించినట్లు ధర్మేష్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు ధర్మేశ్‌ సహా మరో నలుగురికి శ్రీకాంత్‌ బాధ్యత అప్పగించినట్లు విచారణలో తెలిసింది. దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్‌ కోటిపల్లి రేవు వద్దకు తీసుకెళ్లగా.. మరో ముగ్గురు దుర్గాప్రసాద్‌ మెడకు తాడు బిగించి హత్య చేశారని చెప్పినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అయితే కొన్నాళ్లకు మృతదేహం లభించడం, పోస్టుమార్టంలో హత్యగా నిర్ధరణ అయింది.