రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని బొత్స ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.
‘ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. విద్యుత్ చార్జీలు సుమారు ఆరు వేల 72 కోట్లు భారం మోపింది. వచ్చే ఫిబ్రవరిలో పెరిగే ట్రూ అప్ చార్జీలతో కలిపితే 15 వేల 475 కోట్లకు పైగా వసూళ్లకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే.. ఇది సామాన్యుడిపై భారంగా మారుతుంది. విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే ఆవు కథలాగా వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల కోట్లు అప్పు చేసింది. దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేక పోతోంది. గతంలో మేం ఇవ్వగలిగినప్పుడు మీకెందుకు సాధ్యం కాదు. 70 వేల కోట్లు అప్పులు తెచ్చి పెన్షన్, గ్యాస్ తప్ప ఇతర సంక్షేమాలు ఏవీ చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చివుంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.
‘ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు ప్రజలకు లెక్క చెప్పాలి. అప్పులు తెచ్చిన డబ్బుతో స్నోలు, సోకులకు ఖర్చు చేశారా?. ప్రతిపక్షంగా, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జీఎస్టీ 10శాతం తగ్గడం చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, ఆలోచన, యంత్రాంగం మీద పట్టు కనిపించడం లేదు. వాటాల కోసం ఎమ్మేల్యేలు కొట్టుకోవడం, దానికి ముఖ్యమంత్రి పంచాయితీ చేయడం ఏంటి?. బెల్ట్ షాపులకు బహిరంగంగా వేలం వేయడం ఏంటి?, వినడానికే సిగ్గు చేటు. విజయనగరం జిల్లాలో బెల్ట్ షాప్ కు 50 లక్షలకు వేలం వేశారంటే.. ఈ ప్రభుత్వం మీద ఎవరికీ లెక్క లేదు. బెల్ట్ షాపులపై ఇప్పటి వరకు ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా?. ట్రూ అప్ చార్జీలు పెంచిన తర్వాత బిల్లులు వస్తే వినియోగదారులకు హార్ట్ ఎటాక్ లు వస్తాయి’ అని బొత్స మండిపడ్డారు.