Xi Mingze: చైనా రాజకీయాల్లో 2027 సంవత్సరం కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్ జరుగబోతుంది. ఈ సమావేశంలో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఈ కొత్త కేంద్ర కమిటీ కేంద్ర సైనిక కమిషన్ సభ్యులను కూడా నియమిస్తుంది. దీంతో చైనాలో నాయకత్వ మార్పు జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రాగన్ సింహాసనంపై తన కుమార్తె కూర్చో పెట్టడానికి జిన్‌పింగ్ రోడ్ క్లియర్ చేస్తున్నారని సమాచారం.
READ ALSO: Chiranjeevi : పద్మశ్రీ విజేతలను ఇంటికెళ్ళి సన్మానించిన చిరంజీవి
పలు నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం స్థానిక స్థాయిలో నాయకత్వ మార్పులు ప్రారంభమవుతాయని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ CCDI (సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్) సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. పార్టీకి పూర్తిగా విశ్వాసపాత్రులు, విశ్వసనీయులు, బాధ్యతాయుతమైన, పట్టుదలగల అధికారులు అవసరం అని ఆయన ఈ సమావేశంలో వెల్లడించినట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు జి జిన్‌పింగ్ తన కుమార్తె జి మింగ్జేను అధికారంలోకి తీసుకురావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మింగ్జే జిన్‌పింగ్ ఏకైక సంతానం.
జి మింగ్జే నేపథ్యం ఇదే..
జి మింగ్జే జూన్ 25, 1992న చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఫుజౌలో జన్మించారు. ఆమె బీజింగ్ జింగ్‌షాన్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత హాంగ్‌జౌ ఫారిన్ లాంగ్వేజ్ స్కూల్‌లో చదివి, అక్కడ ఫ్రెంచ్ నేర్చుకుంది. 2010లో మింగ్జే తన గుర్తింపును దాచడానికి అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మారుపేరుతో చేరారు. అక్కడ ఆమె మనస్తత్వశాస్త్రం అభ్యసించి 2014లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. నిజానికి జి మింగ్జే బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. 2008 సిచువాన్ భూకంపం తరువాత, ఆమె మియాంజులోని హన్వాంగ్ ప్రాంతంలో ఒక వారం సహాయక చర్యలలో పాల్గొంది. 2013లో ఆమె షాంగ్సీ ప్రావిన్స్‌లోని యానాన్‌లోని లియాంగ్జియాహే గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి కనిపించింది. జి మింగ్జే తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిర్గతం కాకుండా చూసుకుంటుంది. చైనా ప్రభుత్వం ఆమె గోప్యత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. 2019లో ఆమె వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేసినందుకు ఒక వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇటీవల కాలంలో జిన్‌పింగ్ తర్వాత ఆమె చైనా నాయకత్వ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 2027 లో జరగబోతున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ తన కుమార్తెను వారసులుగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: H-1B Visa Delay: అమెరికా కల చెదిరింది.. 2027 వరకు హెచ్-1బి వీసా కోసం ఆగాల్సిందే!