NTV Telugu Site icon

WPL 2025: తెలుగమ్మాయికి రూ.55 లక్షలు.. ఎవరీ శ్రీ చరణి?

Wpl 2025

Wpl 2025

మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2025 మినీ వేలంలో భారత అమ్మాయిలపై కాసుల వర్షం కురిసింది. మహారాష్ట్ర ఓపెనర్ సిమ్రన్‌ షేక్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళనాడు బ్యాటర్‌ కమలిని ముంబై ఇండియన్స్‌ రూ.1.60 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఉత్తరఖండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రేమ రావత్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.1.20 కోట్లకు కైవసం చేసుకుంది. మినీ వేలంలో 124 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండగా.. 5 ఫ్రాంఛైజీలు 19 మందిని కొనుగోలు చేశాయి. 19 మంది ఆటగాళ్ల కోసం రూ.9.05 కోట్లు వెచ్చించాయి.

ఇక తెలుగమ్మాయి శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌ అయిన చరణి కనీస ధర రూ.10 లక్షలు కాగా.. ఆమె కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ దక్కించుకుంది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వీరపునాయుని మండలం ఎర్రమల్లపల్లె గ్రామానికి చెందిన చరణికి చిన్నప్పటి ఆటలంటే ఇష్టం. మేనమామ ప్రోత్సాహంతో క్రికెట్, ఖోఖో, లాంగ్‌జంప్‌ ఆడేది. క్రీడల్లో చురుగ్గా ఉండే చరణి.. 2016-17లో హైదరాబాదులోని సాయ్‌ అకాడమీకి ఎంపికైంది. పదో తరగతిలో అథ్లెటిక్స్‌ విభాగంలో నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాణించింది.

అథ్లెటిక్స్‌ విభాగంలో రాణించినా శ్రీ చరణి మనసు మాత్రం క్రికెట్‌పైనే ఉండేది. అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో రాణించిన చరణి.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అయితే అందుకు ముందుగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ చరణి పట్టుదల చూసి ప్రోత్సహించారు. దాంతో ఇంటర్మీడియట్‌ నుంచి క్రికెట్‌ కెరీర్‌గా మారింది. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి.. అండర్‌-19 మహిళల ఛాలెంజర్స్‌ టోర్నీకి ఎంపికైంది. ఆ టోర్నీలో వికెట్లు తీయడంతో పాటు పరుగులు చేసింది. దాంతో ఆమెకు ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో పంట పండింది.

Show comments