MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు. కాగా ఐపీఎల్-2024 ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని సీఎస్‌కే ప్రకటించింది. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని చెప్పుకొచ్చింది. ఇక, అందుకు అనుగుణంగానే సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ అయితే, బాగుండేదన్నాడు. ధోని ప్లేయర్‌గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు అని పేర్కొన్నాడు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దానికి ధోని అంగీకరించవచ్చు లేదంటే అడ్డుపడే అవకాశం ఉందన్నాడు. కాబట్టి ధోని గ్రౌండ్ బయట ఉంటే రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని జాఫర్ తెలిపారు.
Read Also: Budaun Murder New: బదౌన్ జంట హత్య కేసు.. నిందితుడికి 14రోజుల కస్టడీ
ఈ ఐపీఎల్ లో ధోని వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది అని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, 2022లో ధోని సారథిగా తప్పుకొని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్‌కే నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు ఎదుర్కొవడంతో మధ్యలోనే లీగ్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో చెన్నై నిలిచింది. ఇక, 2023లో ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది. అయితే, ఇవాళ ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆరంభం కానుంది. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడబోతుంది.