NTV Telugu Site icon

D Gukesh: ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ఉంది: గుకేశ్‌

D Gukesh

D Gukesh

ఇప్పుడే తన కెరీర్‌ మొదలైందని, ఇంకా చాలా ఉందని ప్రపంచ చెస్ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచినంత మాత్రాన తానే అత్యుత్తమం కాదని, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ స్థాయికి చేరుకోవాలని ఉందని చెప్పాడు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నా అని, ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా సాగుతున్నా అని పేర్కొన్నాడు. తన జీవితంలో అత్యుత్తమ సందర్భం ఇదే అని గుకేశ్‌ చెప్పుకొచ్చాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ (చైనా)ను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

గుకేశ్‌ మాట్లాడుతూ… ‘గత పదేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో ఎదురుచూశా. 6-7 ఏళ్ల వయసు నుంచి ఛాంపియన్‌ లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ప్రతి చెస్‌ ఆటగాడు ఛాంపియన్‌ గెలవాలని కోరుకుంటాడు. ఇప్పుడు నేను ఛాంపియన్‌ గెలిచాను. నా తల్లిదండ్రులు ఈ విజయం కోసం నాకంటే ఎక్కువగా ఎదురు చూశారు. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశా. 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌, మాగ్నస్ కార్ల్‌సన్ పోటీపడుతుంటే చూశా. ఏదో ఒక రోజు ఆ అద్దాల గదిలో కూర్చువాలనుకున్నా. ఇప్పుడు అద్దాల గదిలో కూర్చోవడం, పక్కనే భారత పతాకం ఉండటం నా జీవితంలోనే అత్యుత్తమ సందర్భం’ అని తెలిపాడు.

Also Read: D Gukesh: ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?

‘మాగ్నస్ కార్ల్‌సన్‌ గెలిచినప్పుడు ఛాంపియన్‌ టైటిల్‌ను భారత్‌కు నేనే తీసుకురావాలని అనుకున్నా. అతిపిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తా అని 2017లోనే చెప్పా. ఈ విజయాన్ని ఊహించలేదు. అందుకే గెలిచిన తర్వాత కాస్త భావోద్వేగానికి గురయ్యా. తొలి గేమ్‌లోనే ఓడిపోయాక లిఫ్ట్‌లో విషీ సర్‌ కలిసి మాట్లాడారు. 2006లో తొలి గేమ్‌లో ఓడాక 11 గేమ్‌లే మిగిలాయని, ఇప్పుడు 13 గేమ్‌లు ఉన్నాయి కాబట్టి నీకు అవకాశాలు వస్తాయి అని చెప్పారు. విషీ సర్‌ నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. అత్యున్నత స్థాయి చెస్‌ ఆడాలన్నదే నా లక్ష్యం. ఇప్పుడే నా కెరీర్‌ మొదలైంది, ఇంకా చాలా ఉంది. కార్ల్‌సన్‌ స్థాయికి చేరుకోవాలి’ అని గుకేశ్‌ తెలిపాడు.

Show comments