Women’s T20 World Cup 2028: 2028 మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ పూర్తిగా తమ దేశంలోనే నిర్వహించాలని చూస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం యూఏఈ (దుబాయ్) వేదిక అయ్యేలా కనిపిస్తోంది. 2028 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 వరకు జరగబోయే ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్థాన్ మెయిన్ హోస్ట్‌గా వ్యవహరించనుంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా గతంలో కుదిరిన హైబ్రిడ్ మోడల్ నిబంధనలే ఈ టోర్నమెంట్‌కూ వర్తిస్తాయని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పాక్‌లో జరిగే టోర్నీలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లను మాత్రం దుబాయ్‌కి మార్చాలని చూస్తున్నారట. ఇరు దేశాల మధ్య ప్రయాణం ఈజీగా ఉండటం, ఖర్చులు తక్కువగా ఇవ్వడం, లాజిస్టిక్స్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండటంతో యూఏఈనే బెస్ట్ ఆప్షన్‌గా పీసీబీ భావిస్తోందట.
ఇక, భారత్ మ్యాచ్‌లు మినహా గ్రూప్ దశలోని మిగతా మ్యాచ్‌లు, అలాగే నాకౌట్ మ్యాచ్‌లన్నింటినీ పాకిస్థానే నిర్వహించనుంది. ఒకవేళ ఫైనల్ చేరే జట్లలో భారత్ లేకపోతే మాత్రం లాహోర్‌లోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని పీసీబీ యోచిస్తోంది. అయితే దీనిపై ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఇదే హైబ్రిడ్ ఫార్ములాను పలు టోర్నీల్లో అమలు చేశారు. 2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ హోస్ట్ చేసినా, భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరిగాయి. ఈ టోర్నీలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ కైవసం చేసుకుంది. అటు 2023 ఆసియా కప్‌లోనూ భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. అలాగే 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు కొలంబోలోనే తన మ్యాచ్‌లు ఆడింది. మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించడంలో భాగంగా పాకిస్థాన్ ఈ టోర్నీని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఐసీసీ ఈవెంట్లలో దాయాది జట్లు తలపడేటప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ ఎలా వర్కవుట్ అవుతుందనేదానికి 2028 మహిళల టీ20 వరల్డ్ కప్ మరో పెద్ద పరీక్షగా మారనుంది.

