Qudruplets: ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం సహజం. అరుదుగా మనం ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఇది. ఓ గర్భిణీ ఏకంగా నలుగురు శిశువులకు ఒకేసారి జన్మనిచ్చింది. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోని బజారిచర ప్రాంతంలోని ఓ క్రిష్టియన్ మిషనరీ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా.. ఓ అమ్మాయికి ఆ తల్లి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Read Also: Kuno’s cheetahs: కునో చిరుతలకు రెండో ఆవాసం కావాలట!
కరీంగంజ్‌లోని నీల బజార్‌కు చెందిన జనతా ఖచియా రెండో కాన్పు కోసం సోమవారం క్రిష్టియన్ మిషనరీ ఆస్పత్రిలో చేరింది.. అనంతరం ఆమెను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలో ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరమని భావించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు జనతా ఖచియా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. కాగా జనతా ఖచియా, ఆమె భర్త లాస్టింగ్ ఖచియాకు అంతకుముందే ఒక పాప ఉంది. ప్రస్తుతం ఈ నవజాత శిశువుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.