Crime News: విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్య, లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు రేకెత్తించాయి. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థ నగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తారింట్లో నుండి వెళ్లిపోయిన వివాహిత, ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డ అత్తామామలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే తెల్లవారు జామున విశాఖ ఆర్కే బీచ్ సమీపాన ఉన్న వైఎంసీఏ బీచ్ ప్రాంతంలో ఆమె శవమై తేలింది. వాకర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె గాజువాకకు చెందిన ఐదు నెలల గర్భవతి అయిన శ్వేతగా నిర్ధారించారు. వివాహిత శ్వేత మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ కొనసాగుతోంది. మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు ఈ మృతిలో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తుంది. ఆమె చనిపోవడానికి కారణాలను అందులో పేర్కొంది.
అందులో ‘నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. బికాజ్ నువ్వు బయటకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్’ లెటర్ రాసి బయటకు వెళ్లి సూసైడ్ చేసుకుంది. చివరిలో ‘ఎ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’అని పెద్దగా రాసింది. అత్తారింటి వేధింపుల వల్లే తన కుమార్తె చనిపోయిందని, వారిని కఠినంగా శిక్షించాలని శ్వేత తల్లి డిమాండ్ చేస్తున్నారు.
Read Also: RK Beach : ఆర్కేబీచ్లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం
శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్‌ను త్రీ టౌన్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో శ్వేత గొడవపడినట్లు తెలిసింది. శ్వేత అత్తింటి వారిపై ఆమె తల్లి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే శ్వేత చనిపోయిందంటూ ఆమె ఆరోపిస్తున్నారు. వెంట పడి మరీ పిల్లను పెళ్లి చేసుకున్నారని, చదివిస్తామని, తాను అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తామంటూ హమీలు ఇవ్వడంతో పెళ్లి చేశానంటూ తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 15న పెళ్లి చేశామని చెప్పారు. తరచూ తన కూతురు బాధను పంచుకునేదని చెప్పారు. చనిపోవడానికి ముందు కూడా ఫోన్ చేసిందని.. తర్వాత భర్త మణికంఠ ఫోన్ చేశాడని కట్ చేసిందని తెలిపింది. కాగా, శ్వేత బయటకు వెళ్లడానికి ముందు సూసైడ్ నోట్ రాసిందని, భర్త గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసిందని అన్నారు. మెట్టినింటిలో పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులకు గురైందని శ్వేత తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఇంట్లో పనులన్నీ శ్వేతతో తన అత్త చేయించేదని ఆమె ఆరోపించింది. అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్‌లో భర్త మణికంఠ హుకుం జారీ చేసేవాడని వాపోయింది. అత్తమామల వేధింపులపై కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా శ్వేత భర్త మణికంఠ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. భార్య కనిపించకపోవడంతో హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. కాగా, మణికంఠ మాట్లాడుతూ.. శ్వేతపై ఆరోపణలు చేశాడు. ప్రతి దానికి వితండవాదం చేసేదని, ఇంట్లో విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పానని, ఫోన్ చేసిన మాట నిజమేనని, తన మాట వినాలని, గొడవలు ఆపేయాలని గట్టిగా చెప్పానన్నారు. దీంతో ఇంట్లో ఫోన్ వదిలేసి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మాట్లాడుకుంటే గొడవలు సర్థుకు పోయేమని, ఇప్పుడు రెండు ప్రాణాలను పోగొట్టుకున్నానని మణికంఠ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.