హైదరాబాద్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న 25 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాగా జయ అనే ఈ నిందితురాలు, ఇప్పటివరకు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తన భర్తకు తెలియకుండా ఆన్లైన్ ద్వారా తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకున్న ఆమె, దొంగతనం చేసే సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు నల్లటి బుర్ఖా, గ్లౌజులు ధరించేది. జయ నుంచి 48 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదుతో పాటు చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన ఐఫోన్ 17ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటన్నింటి విలువ దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికే జయ ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒక చోరీ ప్రయత్నంలో ఆమె తాళం పగలగొట్టలేక వెనుదిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.మరో వేర్వేరు ఘటనలో, కేవలం 20 రోజుల్లోనే 10 ఇళ్లలో చోరీలకు పాల్పడిన నవీన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

