మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేశాయి. ఇదిలా ఉంటే తాజాగా మాజీ న్యాయమూర్తులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దేశంలో హంగ్ వచ్చే పరిస్థితి తలెత్తితే.. అతి పెద్ద కూటమిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఫలితాలకు ముందు రోజు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ పాలకవర్గం ప్రజల సానుభూతి పొందకపోతే.. అధికార మార్పిడి సజావుగా జరగకపోవచ్చని.. లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుందని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏడుగురు మాజీ న్యాయమూర్తులు లేఖలో పేర్కొ్న్నారు. అస్థితర ప్రభుత్వం ఏర్పడితే మాత్రం అతి పెద్ద కూటమిని మాత్రమే ఆహ్వానించాలని కోరారు.
బహిరంగ లేఖపై ఆరుగురు మాజీ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జిఎం అక్బర్ అలీ, అరుణ జగదీశన్, డి హరిపరంధామన్, పిఆర్ శివకుమార్, సిటి సెల్వం, ఎస్ విమల, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ సంతకాలు చేశారు. హంగ్ ఏర్పడితే రాష్ట్రపతే సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించిన కూటమిని ముందుగా ఆహ్వానిస్తారని.. ఆ విధంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సమర్థించాలని మరియు అధికార మార్పిడి సజావుగా జరిగేలా చూడాలని సీజేఐ మరియు సీఈసీని కోరారు.