Site icon NTV Telugu

WI vs IND: కనీస సదుపాయాలు లేవు.. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డుపై అశ్విన్ అసంతృప్తి!

R Ashwin Interview

R Ashwin Interview

No Grass and Old Nets in West Indies Says R Ashwin: వెస్టిండీస్‌ మైదానాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ మైదానాల్లో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని యాష్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ వృద్ధి చెందాలంటే మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలన్నాడు. భారత జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నా.. అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో అశ్విన్‌ ఆడిన విషయం తెలిసిందే.

రవిచంద్రన్ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘వెస్టిండీస్‌లో క్రికెట్ వృద్ధి చెందాలంటే.. ముందుగా మౌలిక వసతులు బాగుండాలి. అండర్-10, అండర్‌-14, అండర్‌-19 ఆటగాళ్లకు మంచి నెట్స్‌, మైదానాలు ఉండేలా చూడాలి. అప్పుడే యువ ఆటగాళ్లలో క్రికెట్ ఆడే ఆసక్తి పెరుగుతుంది. క్రికెట్ ఆట టాలెంట్‌తో కూడిన గేమ్ కాబట్టి బాగా శ్రమించాలి. మైదానాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది’ అని అన్నాడు.

Also Read: Manoj Tiwary Retirement: 5 రోజుల వ్యవధిలోనే.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత క్రికెటర్!

‘బార్బడోస్‌లో టెస్టు మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో మేం ప్రాక్టీస్‌ చేశాం. మైదానంలో కనీసం పచ్చిక కూడా లేదు. నెట్స్‌ కూడా చాలా పాతవి. నేను తప్పుబట్టడానికి ఇలా అనడం లేదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయని చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు విండీస్‌ ఆటగాళ్లుకు కూడా కష్టమే. ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేసిన వారు మంచి పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బంది పడతారు. పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్‌లు ఎప్పుడూ మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి’ అని ఆర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version