NTV Telugu Site icon

WI vs IND 3rd ODI: వెస్టిండీస్‌పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!

Wi Vs Ind 3rd Odi

Wi Vs Ind 3rd Odi

WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్‌ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. శుభ్‌మన్‌ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) భారీ హాఫ్ సెంచరీ చేశాడు.

352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా విండీస్‌పై 13 వన్డే సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2007- 2023 మధ్య కాలంలో భారత్ సిరీస్‌లు గెలిచింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. జింబాబ్వే (1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్‌లు గెలిచిన పాకిస్తాన్‌.. రెండో స్థానంలో ఉంది. శ్రీలంక (2007-23)పై భారత్.. వెస్టిండీస్‌ (1999-22) పాకిస్తాన్ పదేసి విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత భారత్.. విదేశీ గడ్డపై అతిపెద్ద వన్డే విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. ఇదివరకు విదేశీ గడ్డపై భారత్ అతిపెద్ద వన్డే విజయం 125 పరుగులు. వెస్టిండీస్‌పైనే 2019 జూన్ 27న మాంచెస్టర్‌లో 125 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. ఇక వన్డేల్లో వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా). 2018లో కరీబియన్‌ జట్టుపైనే భారత్‌ 224 పరుగుల తేడాతో నెగ్గింది. ఏ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది.

Also Read: Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!