Site icon NTV Telugu

Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఎందుకు ఆర్థిక వేత్త కావాలనుకున్నారు? ఆయన మాటల్లోనే..

Manmohan Singh

Manmohan Singh

26 డిసెంబర్ 2024 రాత్రి.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దేశానికి రెండుసార్లు (2004-2014) ప్రధానమంత్రిగా పనిచేసిన సాటిలేని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ తన 92వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన తీసుకొచ్చిన చాలా విధానాలు కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరి పోశాయి. అతలాకుతలమైన భారత ఆర్థిక వ్యవస్థకు పునర్జీవాన్ని అందించాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఆయనకు భావోద్వేగంతో నివాళులు అర్పిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే 7 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అయితే మన్మోహన్ సింగ్ ఆర్థిక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఆయన చెప్పిన సమాధానం గుర్తించి ఇప్పుడు చర్చిద్దాం..

READ MORE: Manmohan Singh: మన్మోహన్ సింగ్ పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద నిరాశ’’..

దాదాపు 20 ఏళ్ల క్రితం, అమెరికన్ జర్నలిస్టు చార్లీ రోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణాన్ని చెప్పారు. “నేను 15-16 సంవత్సరాల వయస్సు నుంచి.. నా చుట్టూ ఉన్న పేదరికాన్ని చూసి చాలా గందరగోళానికి గురయ్యాను. పాఠశాలలో మినూ మసాని రాసిన ‘మన భారతదేశం’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలోని మొదటి వాక్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ‘చాలా మంది పేదలు నివసించే ధనిక దేశం భారతదేశం.’ అని మినూ మిసాని గారు పుస్తకంలో పేర్కొన్నారు. భారతదేశం ఎందుకు ఇంత పేద దేశంగా ఉందో నేను అర్థం చేసుకోవాలనుకున్నాను? ఇక్కడ ఇంత పేదరికం ఎందుకు ఉంది? ఈ కుతూహలమే నన్ను ఆర్థిక శాస్త్రం వైపు ఆకర్షించింది.” అని ఆయన సమాధానమిచ్చారు.

READ MORE: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్‌లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్

అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో చదివిన మన్మోహన్ సింగ్ ఆ తరువాత పంజాబ్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతోపాటు 54లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చి.. పంజాబ్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి అక్కడ పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా..1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. పివి నరసింహారావు హయాంలో ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఆ విధంగా మన్మోహన్ సింగ్, అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఇరువురు నేతలు కలిసి ఆర్థిక వ్యవస్థను చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు.

Exit mobile version