Uttam Kumar Reddy: నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ విధేయుడు. గాంధీ కుటుంబం అంటే ప్రాణం పెట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వీడుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజంలేదని ఎన్నిసార్లు ఉత్తమ్ చెప్పినా సోషల్ మీడియా వేదికగా ఉత్తమ్ పార్టీ మార్పుపై దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఏకంగా యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించే వార్ రూమ్ లో ఒక ఉద్యోగి ఉత్తమ్ టార్గెట్ గా పోస్టింగ్ లు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పోస్టింగ్ ల దొంగను పట్టుకున్నారు. కొంత కాలం ఈ ప్రచారం ఆగినట్టే ఆగి… ఇప్పుడు మళ్లీ మొదలైంది.
ఉత్తమ్ పార్టీ వీడుతున్నారని, బీఆర్ఎస్ లో చేరుతున్నారని సోషల్ మీడియాలో కొందరు అదేపనిగా పోస్టింగ్ లు పెడుతున్నారు. అంతేకాదు, ఉత్తమ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని.. అధికారంలోకి వచ్చాకా మంత్రి పదవి ఖాయమని.. సతీమణికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారాన్ని రెండు రోజులుగా ముమ్మరం చేశారు. అయితే ఇదంతా దుష్ప్రచారమని.. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఉత్తమ్ మరోసారి స్పష్టం చేశారు.
నిజానికి ఉత్తమ్ నిజాయితీని కాంగ్రెస్ పార్టీలో శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదని పార్టీ నేతలే చెబుతారు. మిగ్ విమానాలు నడిపి దేశం కోసం శ్రమించిన ఉత్తమ్.. రాజకీయాల్లో కూడా అంచెలంచెలుగా ఎదిగారని సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటారు. మంత్రిగా, పీసీసీ అధ్యకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన ఉత్తమ్ కు పార్టీ హైకమాండ్ లో కూడా పట్టుంది. ఉత్తమ్ అంటే గాంధీ కుటుంబం గౌరవిస్తుంది. మళ్లీ ఉత్తమ్, ఆయన సతీమణికి టికెట్ వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదని పార్టీ నేతలు అంటారు. అయితే, ప్రత్యర్థి పార్టీ నేతల కంటే పనికట్టుకుని కాంగ్రెస్ లో కొంతమంది నేతలే తనపై విషప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఉత్తమ్. పార్టీని వీడేది లేదని మరోసారి స్పష్టంగా చెబుతూనే.. ఇలాంటి ప్రచారం చేసే వాళ్లపై లీగల్ గా ముందుకెళతానని హెచ్చరించాడు.