NTV Telugu Site icon

Noel Tata: టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయల్ టాటా.. ఎవరితను..?

నోయల్ టాటా..

నోయల్ టాటా..

Noel Tata: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ కొత్త అధినేతగా నోయెల్ టాటా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

అసలు ఎవరీ నోయెట్ టాటా..?

రతన్ టాటా, జిమ్మీ టాటాల సవతి సోదరుడు నోయల్ టాటా ప్రస్తుతం టాటా గ్రూపులో ప్రముఖ వ్యక్తి. ఇతను టాటా ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ చైర్మన్. టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా గ్రూప్ అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తు్న్నారు.

నవాల్ హెచ్ టాటా, సూనూ కమిసరియంట్‌ దంపతులకు రతన్ టాటా, జమ్మీ టాటా జన్మించారు. అయితే, రతన్ పదేళ్ల వయసులో నవాల్ టాటా, సూనూ విడాకులు తీసుకున్నారు. నావల్ టాటా ఆ తర్వాత సిమోన్ డునోయర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన వ్యక్తే నోయల్ టాటా. రతన్ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు.

నోయల్ టాటా టాటా స్టీల్, వాచ్ కంపెనీ టైటాన్‌కి వైస్ చైర్మన్. టాటా రిటైల్ విభాగం ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం నోయల్ టాటా ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా సన్స్ యాజమాన్యంలో 50 శాతానికి పైగా ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ మరియు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో అతను ట్రస్టీగా కూడా పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం నోయల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గతంలో టాటా సన్స్ చైర్మన్ పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే, నోయెల్ భావ సైరన్ మిస్త్రీకి ఈ బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చీఫ్ ఎన్ చంద్రశేఖరణ్ టాటా సన్స్ చైర్మన్ అయ్యారు.

టాటా గ్రూపులో దాదాపుగా 40 ఏళ్ల వ్యాపార అనుభవం నోయెల్ టాటా సొంతం. నోయెట్ టాటా మరో ప్రసిద్ధి పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు లీహ్ టాటా, మాయా టాటా, నివిల్లే టాటా. వీరు కూడా టాటా గ్రూపులో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. లీహ్ టాటా ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మాయా టాటా టాటా క్యాపిటల్‌లో అనలిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి, కంపెనీలో క్రమంగా ఎదుగుతున్నారు. నెవిల్లే టాటా టాటా యాజమాన్యంలోని ట్రెంట్‌తో తన వ్యాపార కెరీర్‌ని ప్రారంభించారు.