NTV Telugu Site icon

World Cup 2023 Semi-Finals: సెమీస్‌ మ్యాచ్‌లపై వరుణుడి కన్ను.. వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు?

Ind Vs Nz Cwc 2023 Semi Finals

Ind Vs Nz Cwc 2023 Semi Finals

Reserve Days for World Cup 2023 Semi-Finals: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. నవంబర్ 16న కోల్‌కతాలో జరిగే సెమీ ఫైనల్-2లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం నాలుగు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సెమీస్‌ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం పడితే ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రిజర్వ్ డే:
ప్రపంచకప్‌ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది. నవంబర్ 15న భారత్, న్యూజిలాండ్ పూర్తిగా జరగకపోతే.. రిజర్వ్ డే (నవంబర్ 16)న మ్యాచ్ కొనసాగుతుంది. అదే సమయంలో నవంబర్ 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. మరుసటి రోజు (నవంబర్ 17)న కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది.

మ్యాచ్‌ను ఎలా కొనసాగిస్తారంటే:
సెమీ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలో ఆగిపోతే.. మరుసటి రోజు అక్కడి నుంచే కొనసాగుతుంది. ఉదాహరణకు ముందుగా బ్యాటింగ్ చేస్తున్న జట్టు 20 ఓవర్లలో 150 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే.. మరుసటి రోజు 21వ ఓవర్ నుంచి ఇన్నింగ్స్ ఆరంభిస్తుంది. ఆపై ఛేజింగ్‌కు ప్రత్యర్థి జట్టు దిగుతుంది.

కనీసం 20 ఓవర్లు:
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని నిర్ణయించడానికి రెండు జట్లూ కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన జట్టు కచ్చితంగా 20 ఓవర్లు ఆడాలి. అప్పుడే డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం అంపర్లు ఫలితాన్ని నిర్ణయిస్తారు.

Also Read: Rohit Sharma: కోహ్లీ, కేన్‌, బాబర్‌లా కాదు.. రోహిత్ చాలా ప్రత్యేకం!

అదనంగా 2 గంటలు:
సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు 2 గంటల అదనపు సమయం ఉంది. ఈ రెండు గంటల సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగితే.. ఓవర్ల తగ్గింపు ఉండదు. 2 గంటల అదనపు సమయం తర్వాత కూడా మ్యాచ్ ఆరంభం కాకుంటే.. ఓవర్లు తగ్గుతాయి. ప్రతి 5 నిమిషాలకు ఒక ఓవర్ కట్ అవుతుంది.

మ్యాచ్ రద్దయితే:
సెమీ ఫైనల్ రోజు, రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి మ్యాచ్ సాధ్యం కాకపోతే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.