Site icon NTV Telugu

Wheat Price Hike: భగ్గుమంటున్న గోధుమల ధర.. కఠిన చర్యలు తీసుకోనున్న కేంద్రం

Wheat Imports

Wheat Imports

Wheat Price Hike: ప్రస్తుతం సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించడం లేదు. గూడు సరే కూడు కోసం కూడా కోటి తిప్పలు పడాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని చూస్తున్నాయి. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరిగాయి. కనీసం గోధుమలతోనైనా ఓ రొట్టె చేసుకుని కడుపు నింపుకుందాం అంటే అవి భగ్గుమంటున్నాయి. గోధుమల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోధుమల ధరలు పెరగడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గోధుమల నిల్వ పరిమితిని 3000 టన్నుల నుంచి 2000 టన్నులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.

ఈ నిర్ణయాన్ని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటించారు. ఇటీవలి కాలంలో గోధుమల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని స్టాక్ పరిమితిని సమీక్షించామన్నారు. సెప్టెంబర్ 14 నుండి వ్యాపారులు, పెద్ద చైన్ రిటైలర్లు స్టాక్ పరిమితిని తగ్గిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు, జూన్ 12న ప్రభుత్వం గోధుమ వ్యాపారుల కోసం మార్చి 2024 వరకు 3,000 టన్నుల గోధుమ స్టాక్ పరిమితిని విధించింది. ప్రస్తుతం దానిని 2,000 టన్నులకు తగ్గించారు.

Read Also:Iphone 14 Series Price Cut: ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు.. ఎంతంటే?

గత నెలలో, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఎన్‌సిడిఎక్స్‌లో గోధుమ ధరలు నాలుగు శాతం పెరిగాయి. గోధుమల ధర క్వింటాల్‌కు రూ.2,550కి పెరిగింది. దేశంలో తగినంత గోధుమ లభ్యత ఉందని, అయితే కొందరు కృత్రిమంగా గోధుమల కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆహార కార్యదర్శి అన్నారు. గోధుమ దిగుమతులపై పన్నును ఎత్తివేసే యోచన ప్రభుత్వం వద్ద లేదని తెలిపిన ఆహార శాఖ కార్యదర్శి.. రష్యా నుంచి గోధుమల దిగుమతిపై ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక లేదని అన్నారు.

ఆహార సరఫరా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని గోధుమ నిల్వ సంస్థలు గోధుమ స్టాక్ పరిమితి పోర్టల్ (https://evegoils.nic.in/wsp/login)లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం పోర్టల్‌లో స్టాక్ సమాచారాన్ని వారికి అందించాలని పేర్కొంది. అలా చేయని వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. కొత్త ఆర్డర్ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా నిర్దేశిత స్టాక్ పరిమితికి మించి ఎక్కువ స్టాక్ ఉన్న వ్యాపారులు నిర్ణీత పరిమితిలోపు స్టాక్‌ను తీసుకురావాలని ప్రభుత్వం తెలిపింది. దేశంలో గోధుమలకు కృత్రిమ కొరత ఏర్పడకుండా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పరిమితిని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ధరలను నియంత్రించేందుకు, మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా నిశితంగా పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Read Also:Anjeera Benefits : అంజీరాలను ఇలా తీసుకుంటే.. అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం..

Exit mobile version