Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!

Wheat Flour Soup Recipe

Wheat Flour Soup Recipe

Wheat Flour Soup Recipe: చలికాలంలో రాత్రి భోజనం విషయంలో చాలామంది జాగ్రత్త పడుతుంటారు.. వీలైనంత వరకు లైట్‌ ఫుడ్‌ తీసుకోవడానికి ఇష్టపడతారు.. తేలికపాటితో వేడివేడి ఆహారం కావాలంటారు.. అయితే, ప్రతిరోజూ గోధుమ రొట్టెలు, కూరగాయలతో భోజనం చేసి విసుగెత్తిపోయిన వారికి గోధుమ పిండి సూప్ మంచి ప్రత్యామ్నాయం. గోధుమ పిండి, వెన్న, వెల్లుల్లి, తాజా కూరగాయలతో తయారయ్యే ఈ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది. క్రీమీగా, చిక్కగా ఉండే ఈ సూప్ కడుపు నింపడంతో పాటు చలికాలంలో వేడివేడి ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఇంట్లోనే తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ గోధుమ పిండి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.

గోధుమ పిండి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
* గోధుమ పిండి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
* వెన్న లేదా దేశీ నెయ్యి – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
* సన్నగా తరిగిన వెల్లుల్లి – 1 టీస్పూన్
* సన్నగా తరిగిన కూరగాయలు – అర కప్పు
* పాలు – అర కప్పు (ఐచ్ఛికం)
* నీరు లేదా వెజిటబుల్ స్టాక్ – 2 నుంచి 2.5 గ్లాసులు
* నల్ల మిరియాల పొడి – అర టీస్పూన్
* వేయించిన జీలకర్ర పొడి లేదా ఒరేగానో – అర టీస్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* కొత్తిమీర – కొద్దిగా

గోధుమ పిండి సూప్ తయారీ విధానం
– ముందుగా ఒక బాణలి లేదా కడాయిని స్టవ్‌పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత గోధుమ పిండిని వేసి తక్కువ మంటపై బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా చేయడం వల్ల సూప్‌కు మంచి రుచి, సువాసన వస్తాయి. ఇప్పుడు వేయించిన పిండిలో ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మొక్కజొన్న వంటి కూరగాయలను వేసి వెన్నలో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పిండి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ రెండు గ్లాసుల నీటిని లేదా వెజిటబుల్ స్టాక్‌ను నెమ్మదిగా పోయాలి. సూప్ మరింత క్రీమీగా ఉండాలనుకుంటే అర కప్పు పాలు కూడా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి లేదా ఒరేగానో వేసి బాగా కలపాలి. మధ్యస్థ మంటపై సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. సూప్ కొద్దిగా చిక్కబడి, మంచి మెరుపుతో కనిపించే వరకు ఉడికిస్తే సరిపోతుంది.

వేడివేడిగా సర్వ్ చేసుకోండి!
చివరగా సూప్‌పై కొద్దిగా వెన్న, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అనంతరం ఒక గిన్నెలోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన గోధుమ పిండి సూప్ సిద్ధం. చలికాలంలో రాత్రి భోజనంగా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా దీనిని ఆస్వాదించవచ్చు. మీకు నచ్చిన కూరగాయలను జోడించుకోవడం ద్వారా రుచిని మరింత పెంచుకోవచ్చు.