WhatsApp New Update: వాట్సాప్‌లో ఎక్కువ మందితో గ్రూప్ తయారు చేయలేకపోతున్నారా? అయితే, వాట్సాప్ వినియోగదారులకు మెటా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఒక వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 1,024 మంది సభ్యులను మాత్రమే చేర్చుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని 1,500 మందికి పెంచుతూ వాట్సాప్ కీలక మార్పు చేసింది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. సాధారణ గ్రూపులతో పాటు కమ్యూనిటీ గ్రూపులకు కూడా ఈ సదుపాయం వర్తించనుంది.
ఇకపై ఒకే గ్రూపులో 1,500 మంది!
ప్రస్తుతం కుటుంబాలు, పాఠశాలలు, ఉద్యోగ సంస్థలు, సంఘాలు, వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్ గ్రూపులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని గ్రూపుల్లో సభ్యుల సంఖ్య వెయ్యి దాటుతోంది. అయితే గతంలో 1,024 మంది పరిమితి ఉండటంతో ఎక్కువ మందిని చేర్చుకోవాలంటే అదనపు గ్రూపులను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన వాట్సాప్ తాజాగా సభ్యుల పరిమితిని 1,500కు పెంచింది. దీంతో ఎక్కువ మంది సభ్యులు ఒకే గ్రూపులో చేరి సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ కొత్త సదుపాయం కోసం వినియోగదారులు ప్రత్యేకంగా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆటోమేటిక్‌గా అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు దశలవారీగా ఈ అప్‌డేట్ అందనుంది.
గ్రూపుల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లు
వాట్సాప్ ఇటీవల గ్రూప్ చాట్స్‌ను మరింత సులభంగా నిర్వహించేందుకు నాలుగు కొత్త ఫీచర్లను కూడా ప్రకటించింది. వీటిలో ముఖ్యమైన సందేశాలను ఎక్కువ కాలం చాట్ పైభాగంలో ఉంచుకునే లాంగ్‌టర్మ్ పిన్నింగ్ సదుపాయం ఒకటి. దీనివల్ల గ్రూపులోని ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా గుర్తించవచ్చు. అలాగే గ్రూప్ స్టేటస్ అప్‌డేట్స్‌ను షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూపులో తమను ప్రస్తావించిన మెసేజ్‌లు (Mentions), వాటికి వచ్చిన రిప్లైలను సులభంగా గుర్తించేందుకు చాట్ ఫిల్టరింగ్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. మరోవైపు, గ్రూపులో కొత్తగా చేరిన సభ్యులకు గతంలో జరిగిన సంభాషణల గురించి తెలుసుకునేలా మెసేజ్ హిస్టరీ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా కొత్త సభ్యులు ఎంపిక చేసిన పాత సందేశాలను కూడా చూడగలుగుతారు. ఈ మార్పులతో వాట్సాప్ గ్రూపుల నిర్వహణ మరింత సులభంగా మారనుంది.

