NTV Telugu Site icon

Agnipath Scheme: అసలు అగ్నిపథ్ స్కీమ్ ఏంటి..?

Jpg

Jpg

భారత దేశ సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చి దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం  ‘అగ్నిపథ్ స్కీమ్’ని తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు జూన్ 14న ఈ స్కీమ్ ను ప్రకటించారు. భారతీయ సైన్యంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సైన్యం  బడ్జెట్ లో పెన్షన్లకు వెచ్చించే నిధులకు కోత వేయడంతో పాటు ఈ నిధులను ఆధునిక ఆయుధాల కొనుగోలుకు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.

17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు ఉన్న  యువకులను 4 ఏళ్ల కాలానికి సైన్యంలో  రిక్రూట్ చేసుకోనున్నారు. అయితే తాజాగా 21 ఏళ్ల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతూ కేంద్రం  ఈ రోజు నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలానికి సంబంధించి వచ్చే మూడు నెలల్లో రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తామని ఆర్మీ అధిపతులు వెల్లడించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ లో సెలక్ట్ అయిన వారిని ‘ అగ్నివీర్’లుగా పిలుస్తారు. వీరిని సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లోకి తీసుకుంటారు. 45,000 మందిని తొలి బ్యాచ్ కింద తీసుకోనున్నారు. 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ ను సిద్ధం చేయాలని సైన్యం భావిస్తోంది. ఇలా చేరిన వారికి 6 నెలల పాటు టెక్నాలజీతో పాటు ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నారు.

ఆర్మీలో జాయిన్ అయిన అగ్నివీర్లకు సాధారణ సైనికుడికి ఉండే విద్యార్హత ఉండనుంది. పదో తరగతి మినిమం క్వాలిఫికేషన్. ఆన్ లైన్ విధానం ద్వారా ఎంపిక జరగనుంది. అయితే నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువతను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ నాలుగేళ్లలో మొదటి ఏడాది రూ. 4.76 లక్షల ప్యాకేజీతో జీతం ప్రారంభం అయి నాలుగో ఏడాది రూ. 6.92 లక్షలకు చేరనుంది. దీంతో నాలుగేళ్ల తరువాత రిటైర్మెంట్ తరువాత సేవానిధి కింద ఒక్కొక్కరికి రూ.11.71 లక్షల ప్యాకేజీ రానుంది. దీంతో పాటు విధి నిర్వహణ సమయంలో రూ.48 లక్షల బీమా కవరేజీని కూడా కేంద్రం అందించనుంది.

అయితే పెన్షన్ వంటి సదుపాయాలు మాత్రం ఉండవు. నాలుగేళ్ల తరువాత కేవలం 25 శాతం మందిని మాత్రమే వారి అర్హత, ప్రతిభ ఆధారంగా మరో 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు. నాలుగేళ్ల రిటైర్మెంట్ తరువాత వాళ్ల కెరీన్ ను ప్లాన్ చేసుకునేందుకు సేవానిధి ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. దీంతో పాటు  అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా తరువాత పోలీస్, బీఎస్ఎఫ్ ఇతర రక్షణ దళాల్లో పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.

సైన్యాన్ని యువతతో నింపడంతో పాటు కొన్ని ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇజ్రాయిల్, చైనా వంటి దేశాల్లో ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నియమం ఉంది. దీని వల్ల వాళ్ల రిజర్వ్ బెంచ్ ను తయారు చేసుకుంటోంది. యుద్ధ సమయంలో రిజర్వ్ బెంచ్ అనేది కీలకంగా ఉంటుంది. 2022-23 రూ. 5,25,166 కోట్లు, ఇందులో రక్షణ పెన్షన్‌ల కోసం రూ. 1,19,696 కోట్లు కేటాయించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ సక్సెస్ అయితే పెన్షన్ బడ్జెట్ ను నూతన ఆయుధాల కొనుగోలుకు, టెక్నాలజీకి వినియోగించే అవకాశం ఏర్పడుతుంది.