FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..

Fixeddeposits

Fixeddeposits

ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు తీసుకోకపోతే ఏం జరుగుతుందనే దానిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. సాధారణంగా ఎఫ్‌డీ కాలపరిమితి పూర్తి కాగానే ఖాతాదారుడికి డబ్బులు అందాలి. కానీ చాలాసార్లు సమాచారం లేకపోవడం వల్ల అలా జరగదు. ఎఫ్‌డీ ఖాతా తెరిచే సమయంలోనే ఆటో-రడ్యూవల్ ఆప్షన్ ఎంచుకుంటే, బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ డిపాజిట్ మళ్లీ రెన్యూవల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అయ్యేలా ఉంటే ఆ ప్రక్రియ జరుగుతుంది.

గడువు తీరిన తర్వాత కూడా ఎఫ్‌డీ డబ్బులు తీసుకోకపోతే, ఆ మొత్తంపై వడ్డీ విషయంలో కొన్ని మార్పులు ఉంటాయి. పాత ఎఫ్‌డీకి ఇస్తున్న వడ్డీయే ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పలేం. సాధారణ సేవింగ్స్ ఖాతా వడ్డీ లేదా గడువు ముగిసిన ఎఫ్‌డీపై వర్తించే వడ్డీ రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తమే లభిస్తుంది. ఒకవేళ ఎఫ్‌డీ మెచ్యూరిటీ తేదీ నుంచి పది సంవత్సరాల వరకు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, ఆ డబ్బును అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. పదేళ్లు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని డీఈఏ ఫండ్‌కు బ్యాంకులు బేలన్స్ చేసి బదిలీ చేస్తాయి.

అయితే, డిపాజిట్ చేసిన సొమ్ము ఎప్పటికైనా ఖాతాదారుడికే చెందుతుందని గమనించాలి. ఖాతాదారుడు లేదా చట్టపరమైన వారసులు ఎప్పుడైనా సంబంధిత బ్యాంకును సంప్రదించి, సరైన ధ్రువపత్రాలు సమర్పించి ఆ డబ్బును తిరిగి పొందవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసులు డెత్ సర్టిఫికెట్, గుర్తింపు పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎఫ్‌డీని తిరిగి రెన్యూవల్ చేసే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, డబ్బు ఎప్పుడు అవసరమవుతుంది అనే విషయాలను బేరీజు వేసుకోవడం మంచిది. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా కుటుంబ సభ్యులకు ఎఫ్‌డీ వివరాలు, నామినీ సమాచారం ఎప్పుడూ అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.