Tamil Nadu: తమిళనాడులో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. జాలర్ల వలకు 38.6కిలోల బరువున్న తిమింగళం వాంతి చిక్కింది. దీని ధర మార్కెట్లో 50కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.. తమిళనాడులోని కల్పాక్కం సమీపంలో తిమింగలం వాంతి లభ్యమయ్యింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కడపాక్కం సమీపంలోని కడకుప్పం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్‌లు చేపల వేట కోసం కొద్ది రోజుల కిందట సముద్రంలోకి వెళ్లారు. నడి సముద్రంలో వారు విసిరిన వల బరువుగా అనిపించడంతో భారీ చేప చిక్కిందని భావించారు. పైకి లాగే సరికి అందులో చేపకు బదులు మరేదో ఉండటంతో నిశితంగా గమనించారు. చివరకు అది తిమింగలం వాంతిగా గుర్తించి ఈ విషయం గురించి అరుచ్చిపాక్కం అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.
తిమింగలం వాంతి స్పెర్మ్ వేల్స్ జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అవుతుంది. ఇది తిమింగలం యొక్క ప్రేగులలో తయారైన మైనపు, ఘన, మండే పదార్థం అని చెబుతున్నారు. ఎంతో విలువైన తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు. తిమింగలం వాంతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అరుదైన స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే ఇది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ ని మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ ముక్కలై ముద్దలా మారిపోతుంది. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే… అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబెర్‌గ్రిస్ అంటారు.
Read Also: Tiruchi Gold: అండర్ వేర్ ఐడియా బాగుంది.. కానీ అధికారులు పట్టేశారుగా..
పురాతన కాలం నుండి, తిమింగలం వాంతిని సువాసనలు, అత్యాధునిక పరిమళ ద్రవ్యాలలో, అలాగే వివిధ సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు. అందుకే దీనిని చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. గత సంవత్సరం ముంబై పోలీసులు ఇచ్చిన అంచనాల ప్రకారం, 1 కిలో తిమింగలం వాంతి విలువ 1 కోటి రూపాయలు . ఈ కారణంగా, సముద్రంలో ఈ విసర్జనను ” ఫ్లోటింగ్ గోల్డ్”గా సూచిస్తారు. ఈజిప్షియన్లు దీనిని ధూపం వలె ఉపయోగిస్తారు. చైనీయులు దీని డ్రాగన్ స్పిటిల్ సెంట్ గా వ్యవహరిస్తుంటారు. ఈ వాంతిని కాల్చినప్పుడు… ముందుగా చెడువాసన వస్తుంది… కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది. థాయ్‌లాండ్ సహా పలు దేశాలకు చెందిన మత్స్యకారులు తిమింగలం వాంతితో కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి.