NTV Telugu Site icon

WFI India: ప్రపంచ వేదికపై భారత్‌కు భారీ షాక్‌.. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు!

Wfi India

Wfi India

UWW has suspended the membership of the WFI: ప్రపంచ వేదికపై భారత రెజ్లింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ప్రకటించింది. ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైన కారణంగా యూడబ్ల్యూడబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో డబ్ల్యుఎఫ్‌ఐ వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

భారతదేశం యొక్క రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన ఫెడరేషన్ జూన్ 2023లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ భారతీయ రెజ్లర్ల వరుస నిరసనలు మరియు వివిధ రాష్ట్ర విభాగాల నుంచి వచ్చిన పిటిషన్‌ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడ్డాయి. దాంతో డబ్ల్యూఎఫ్‌ఐ తన ఎన్నికలను సకాలంలో నిర్వహించనందుకు యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెండ్ చేసింది. దాంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ చేయడానికి భారతీయ రెజ్లర్లకు అనుమతి ఉండదు. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్-క్వాలిఫైయింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తటస్థ క్రీడాకారులుగా పోటీపడాల్సి ఉంటుంది.

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్‌ఐ వివాదంలో చిక్కుకుంది. శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని ఆందోళన చేయడంతో.. డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను ఐఓఏ రద్దు చేసింది. ఆపై నిర్వహణ బాధ్యతను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ అయింది. అప్పటినుంచి 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాలి.

Also Read: World Cup 2023: చంద్రయాన్‌ 3 విజయవంతం.. ఇక భారత్‌దే ప్రపంచకప్‌ 2023!

గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలని, లేదంటే సస్పెన్షన్‌ వేటు తప్పదని ఏప్రిల్‌ 28న యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించింది. అప్పటినుంచి పలు కారణాలతో డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరికి ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. ఒక రోజు ముందు పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలోనే భారత సభ్యత్వంపై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు వేసింది.

Show comments