ODI World Cup 2027: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏకచక్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు ఎంతకీ కనిపించడం లేదు. రెండుసార్లు వన్డే ప్రపంచకప్, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన కరేబియన్ జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది! ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లతో పాటు, ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే, ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుత విజయంతో అఫ్గానిస్థాన్ పుంజుకోవడంతో వెస్టిండీస్ టాప్-8 రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా అఫ్గానిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు వచ్చే ఏటి వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా క్వాలిఫై అయ్యాయి.
కట్-ఆఫ్ తేదీకి ముందు వెస్టిండీస్ జట్టు భారత్‌తో మరో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ రెండు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించకపోతే.. పాయింట్ల సమీకరణాల ప్రకారం అఫ్గానిస్థాన్‌ను వెనక్కి నెట్టి చివరి స్థానాన్ని దక్కించుకోవడం మాత్రం అసాధ్యం. నాలుగేళ్ల క్రితం కూడా విండీస్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని, క్వాలిఫయర్స్ టోర్నీలో ఘోరంగా విఫలమై తమ సుదీర్ఘ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయింది. ఆ పరాభవం వల్ల ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా విండీస్ దూరమవ్వాల్సి వచ్చింది.
వెస్టిండీస్ ముందున్న సుదీర్ఘ అర్హత మార్గం ఇదే:
14 జట్లతో జరగనున్న ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టాలంటే వెస్టిండీస్ ఇప్పుడు ఎంతో కష్టమైన క్వాలిఫైయింగ్ ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. విండీస్ జట్టు ఇప్పుడు ఐర్లాండ్, ‘సిడబ్ల్యూసి లీగ్ 2’ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జట్లు, ‘క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్స్’ ద్వారా అర్హత సాధించిన జట్లతో కలిపి మొత్తం 10 జట్లు పాల్గొనే ‘ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్’ టోర్నీలో తలపడనుంది. ఈ అర్హత ప్రక్రియ కోసం లీగ్ 2 నుంచి దిగువన ఉన్న 4 జట్లు, ఛాలెంజ్ లీగ్‌లోని రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు కలిపి మొత్తం 8 జట్లతో ‘క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్స్’ నిర్వహిస్తారు. మూడు రౌండ్ రాబిన్ టోర్నీల అనంతరం ఈ ప్లే-ఆఫ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్రధాన క్వాలిఫైయర్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి ప్రపంచకప్‌నకు వెళ్లాలంటే విండీస్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి.. ఆ 10 జట్ల ఐసీసీ క్వాలిఫైయర్ టోర్నీలో విజేతగా నిలిచి నేరుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టడం. ఒకవేళ టోర్నీ విజేతగా నిలవలేకపోతే.. కనీసం రెండు, మూడు లేదా నాల్గో స్థానంలో అయినా టోర్నీని ముగించాలి. అలా ముగిస్తేనే చివరి ప్రపంచకప్ స్థానం కోసం నిర్వహించే “సూపర్ సిరీస్” ప్లే-ఆఫ్ రౌండ్‌లో పోటీపడే అవకాశం దక్కుతుంది. మరి ఈ కష్టతరమైన అర్హత పోరును దాటుకుని కరేబియన్లు ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారో లేదో వేచి చూడాలి!

