Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!

West Bengal Election

West Bengal Election

Mamata Banerjee: ఎంతో ఉత్కంఠగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ఎట్టకేలకు ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి మే 4న వెలువడబోయే ఫలితాలపైనే ఉంది. ఇక ఈ ఏడాది పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు విజయం తమదేనని ప్రకటించుకుంటున్నాయి. పలు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా సైతం వేశాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వీడియో సందేశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తన గెలుపుపై అపారమైన ధీమా వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సరళిపై ఆమె నిప్పులు చెరిగారు. ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభంజనం సృష్టించబోతోందని, తాము ఏకంగా 226 కంటే ఎక్కువ సీట్లు సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమతా ధీమా వ్యక్తం చేశారు. విపరీతమైన ఎండలను, ప్రత్యర్థుల అరాచకాలను ఎదిరించి ఓటు వేసిన బెంగాల్ ప్రజలకు ఆమె “ప్రణామం, సలాం” తెలియజేస్తూ కృతజ్ఞతలు కురిపించారు. ముఖ్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన తన పార్టీ కార్యకర్తలను ‘వీరులు’గా అభివర్ణించారు.

కేంద్రంలోని అధికార పార్టీపై మమతా బెనర్జీ విమర్శల దాడిని ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల నేతలు కలిసి బెంగాల్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి, వారిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రయోగించారని ఆరోపించారు. అయితే బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా వీటన్నింటికీ తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంశంపై స్పందిస్తూ.. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇది ఒక కుట్ర అని మండిపడ్డారు. 2016, 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి అంచనాలే వచ్చాయని, కానీ తుది ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు.

కౌంటింగ్ రోజున అత్యంత అప్రమత్తంగా ఉండాలని తన అభ్యర్థులకు, ఏజెంట్లకు మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈవీఎంల (EVM) విషయంలో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాల్‌కు మిషన్లను తరలించే క్రమంలో మార్పులు జరిగే అవకాశం ఉందని, అందుకే కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అవసరమైతే తానే స్వయంగా మైదానంలోకి దిగి పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉంటూ ప్రజాస్వామ్య విజయాన్ని ఆస్వాదించాలని సూచించారు. బెంగాల్ గడ్డపై ‘మా, మాటి, మానుష్’ (తల్లి, నేల, ప్రజలు) సిద్ధాంతమే మళ్లీ గెలుస్తుందని, ప్రజలు ఇప్పటికే అరాచకానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేశారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.