Site icon NTV Telugu

CM Revanth Reddy: “వనమే మనం – మనమే వనం”.. పచ్చదనంతో పాటు మహిళా శక్తికే ప్రాధాన్యం..!

Revanth

Revanth

CM Revanth Reddy: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వనమే మనం… మనమే వనం” అని పెద్దలు చెప్పిన మాటలను స్మరించుకుంటూ, పర్యావరణ పరిరక్షణే మన భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు “అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి” అని సూచిస్తూ, ఆ తల్లులు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సీఎం కోరారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటి, అవే మన పిల్లల్లా సంరక్షించాలన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా పచ్చదనంతో నిండిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also:YS Jagan: వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి.. షరతులు వర్తిస్తాయి..!

పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళా శక్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు సీఎం వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత వంటి కీలక కార్యక్రమాల్లో ఆడబిడ్డలకే ముందుగా అవకాశం కల్పించామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా, వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చి మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దినట్లు గుర్తుచేశారు. అలాగే మరిన్ని అవకాశాలు కల్పించేందుకు హైటెక్ సిటీలోని మైక్రోసాఫ్ట్, విప్రో కంపెనీల పక్కన మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్‌కు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అని పేర్కొంటూ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు.

Read Also:Revanth Reddy: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం..!

ఇంకా అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 మహిళా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతున్నానని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రకారం 51 సీట్లు మహిళలకు కేటాయించడమే కాకుండా మరో 9 సీట్లు అదనంగా ఇస్తూ మొత్తం 60 సీట్లలో మహిళలకు టికెట్స్ ఇస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Exit mobile version