WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!

  • డబ్ల్యూసీఎల్ 2026లో భారత్ ఛాంపియన్స్‌కు ఓటమి
  • షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌
  • సౌతాఫ్రికా ఛాంపియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం..
Wcl 2026

Wcl 2026

WCL 2026: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026లో భారత్ ఛాంపియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ 4 వికెట్ల తేడాతో భారత్ ఛాంపియన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛాంపియన్స్ ఛేదించి విజయాన్ని అందుకుంది.

భారత్ ఛాంపియన్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. 248.39 స్ట్రైక్‌రేట్‌తో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డ ఉతప్ప భారత జట్టుకు భారీ స్కోరుకు పునాది వేశాడు. చివరకు ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

మరో ఓపెనర్ అంబటి రాయుడు 19 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. ఎదుర్కొన్న తొలి బంతికే షాన్ వాన్ బెర్గ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఉతప్ప తర్వాత స్టువర్ట్ బిన్నీ భారత్ ఇన్నింగ్స్‌కు కీలకంగా మారాడు. బిన్నీ 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఉతప్ప, బిన్నీ మెరుపులతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది.

చివర్లో యూసుఫ్ పఠాన్ 23 బంతుల్లో రెండు సిక్సర్లతో 24 పరుగులు చేయగా.. ఇర్ఫాన్ పఠాన్ 8 పరుగులు చేశాడు. రిషి ధావన్ 4, అభిమన్యు మిథున్ అజేయంగా 2, పవన్ నేగి 8 పరుగులు చేశారు. దీంతో భారత్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఛాంపియన్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, షాన్ వాన్ బెర్గ్, హార్డస్ విల్జోయెన్ చెరో రెండు వికెట్లు సాధించారు. వీరితోపాటు వేన్ పార్నెల్, మార్చంట్ డి లాంగే చెరో వికెట్ తీశారు.

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు రిచర్డ్ లెవీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మాత్రం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో డివిలియర్స్ డకౌట్ కావడంతో భారత్‌కు కీలక వికెట్ దక్కింది.

ఇలాంటి కీలక సమయంలో జీన్ పాల్ డుమినీ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకున్నాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన డుమినీ కేవలం 34 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 7 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఆయనకు తోడుగా మోర్నే వాన్ వైక్ 14 పరుగులు చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ కూడా కీలక సమయంలో మెరుపులు మెరిపించాడు. ఇంగ్రామ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి లక్ష్య ఛేదనను సులభతరం చేశాడు.

చివరకు వేన్ పార్నెల్, హార్డస్ విల్జోయెన్ మ్యాచ్‌ను ముగించారు. పార్నెల్ 8 బంతుల్లో 2 ఫోర్లతో అజేయంగా 12 పరుగులు చేయగా.. విల్జోయెన్ 4 బంతుల్లో ఒక సిక్సర్‌తో అజేయంగా 9 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా ఛాంపియన్స్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు పడగొట్టగా.. ధవల్ కులకర్ణి, అభిమన్యు మిథున్, రిషి ధావన్, పవన్ నేగి తలో వికెట్ సాధించారు.