IND vs PAK match has been cancelled in WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నేడు జరగాల్సిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. టీమిండియా మాజీ క్రికెటర్లు మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపడమే ఇందుకు కారణం అని పేర్కొన్నారు. హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ సహా మరికొంత మంది భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు ఇండియా టుడే తమ కథనంలో పేర్కొంది. అయితే భారత్, పాకిస్తాన్ జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారా? లేదా? అన్న దానిపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు.
పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాయాది పాకిస్థాన్‌తో ఏ క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి స్పష్టం చేసింది. మాజీలు ఆడే డబ్ల్యూసీఎల్‌లో ఇండో-పాక్ టీమ్స్ తలపడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా మాజీలకు ఎవరు అనుమతి ఇచ్చారు?, దేశం గురించి కాస్తైనా ఆలోచించక్కర్లా? అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. కొందరు ప్లేయర్స్ తాము మ్యాచ్ ఆడలేమని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు ముందే చెప్పారట. చివరకు మ్యాచ్ రద్దు అయింది. నేడు జరిగే మ్యాచ్ రద్దయిందని, డబ్బులు వాపస్ ఇస్తామని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు.
Also Read: World Playing XI: వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్.. ధోనీ, కోహ్లీకి దక్కని చోటు!
పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో తాను ఆడలేననే విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు మే 11నే చెప్పినట్లు తెలిపాడు. డబ్ల్యూసీఎల్ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే తాను నిర్ణయం తీసుకున్నా అని, ఈ నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అని గబ్బర్ తన పోస్టులో తెలిపాడు. తనకు దేశమే ముఖ్యం అని, దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. యువరాజ్ సింగ్ నాయకత్వంలో ఇండియా ఛాంపియన్స్ బరిలోకి దిగింది. పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దయింది.
