India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!

  • 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత ప్లేయింగ్ XIను ఎంపిక చేసిన వసీం జాఫర్
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశం
  • రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఎంపిక
  • మూడో స్థానంలో విరాట్ కోహ్లీ
  • నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్
  • వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్
  • ఆరో స్థానానికి హార్దిక్ పాండ్యా లేదా నితీశ్ కుమార్ రెడ్డి
  • స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
  • పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ..
India Playing Xi

India Playing Xi

Wasim Jaffer India Playing XI: 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనకు నచ్చిన భారత ప్లేయింగ్ XIను ఎంపిక చేశాడు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకున్న జాఫర్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి చోటిచ్చాడు. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసిన జాఫర్.. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఒకరు ఆడాలని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ ఫిట్‌గా లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవచ్చని పేర్కొన్నాడు.

ఆ తర్వాత స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లను జాఫర్ ఎంపిక చేశాడు. అయితే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తన ప్లేయింగ్ XIలో చోటివ్వకపోవడం గమనార్హం. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలను ఎంపిక చేశాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు భువనేశ్వర్ కుమార్‌కు కూడా జాఫర్ జట్టులో చోటు కల్పించలేదు. అయితే 2027 ప్రపంచకప్‌కు భారత పేస్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఇంకా స్పష్టత కనిపించడం లేదు. గత వన్డే ప్రపంచకప్ తర్వాత బుమ్రా చాలా తక్కువ వన్డే మ్యాచ్‌లే ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణను తరచూ గాయాలు వేధించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ టీ20ల్లో చూపినంత ప్రభావాన్ని వన్డేల్లో చూపలేకపోతున్నాడనే అభిప్రాయాలు ఉన్నాయి. గుర్నూర్ బ్రార్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ వంటి పేసర్లను కూడా భారత్ పరీక్షిస్తోంది. దీంతో ప్రపంచకప్ సమయానికి బుమ్రాతో కలిసి భారత పేస్ దళంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

వసీం జాఫర్ ఎంపిక చేసిన 2027 ప్రపంచకప్ భారత ప్లేయింగ్ XI:

శుభ్‌మన్ గిల్ (C), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (W), హార్దిక్ పాండ్యా/నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.