Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!

  • టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్..
  • బీసీసీఐ సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..
Wasim Jaffer

Wasim Jaffer

Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించిన తర్వాత ఖాళీ అయిన ఈ పదవికి జాఫర్ తన పేరును పరిశీలనలోకి తీసుకొచ్చారు. తాను ఈ పదవికి దరఖాస్తు చేసినట్లు జాఫర్ స్వయంగా వెల్లడించారు.

48 ఏళ్ల వసీం జాఫర్ భారత్ తరఫున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్, పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీలు కూడా సాధించారు. 2000 నుంచి 2008 వరకు సాగిన ఆయన టెస్టు కెరీర్‌లో 34.10 సగటుతో పరుగులు చేశారు. వన్డేల్లో మాత్రం 2006లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో జాఫర్‌కు ఘనమైన రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు, 57 సెంచరీలు సాధించారు. 50కుపైగా బ్యాటింగ్ సగటుతో టాప్ పొజిషన్ లో ఉన్నారు.

1996-97 సీజన్‌లో ముంబై తరఫున సీనియర్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జాఫర్.. ఆ తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. దేశవాళీ క్రికెట్‌పై ఉన్న భారీ అనుభవం ఇప్పుడు సెలెక్టర్ పదవికి ఆయనకు ప్రధాన బలంగా మారే అవకాశం కానుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC)లో ఉన్న అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే జాఫర్‌ను ఎంపిక చేస్తే.. ప్రస్తుత అభ్యర్థుల్లో అత్యధిక టెస్టులు ఆడిన వ్యక్తిగా ఆయన చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. జాఫర్ 31 టెస్టులు ఆడగా, మరో అభ్యర్థి ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజాతో పాటు ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, శివసుందర్ దాస్ సభ్యులుగా ఉన్నారు.