Wasim Akram Heap Praise on Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని కితాబిచ్చాడు. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడన్నాడు. ఔట్ స్వింగర్లను తన మాదిరే వేస్తున్నాడని, కొన్నిసార్లు తనను మించిన నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడని అక్రమ్ ప్రశంసించారు. మొత్తంగా బుమ్రా తనకంటే బాగా బౌలింగ్ చేస్తున్నాడని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
తాజాగా పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ఏ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్ బ్యాటర్లను జస్ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించిన విధానం అద్భుతం. మంచి వేగంతో బంతులు వేశాడు. ముఖ్యంగా రౌండ్ ద వికెట్‌లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు ఆడలేని రీతిలో బంతులు వేశాడు. బుమ్రా లైన్ అండ్ లెంగ్త్ బంతులే ఇంగ్లీష్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. తొలి ఓవర్లో కొన్ని బంతులను ఇన్‌స్వింగ్ చేసిన బుమ్రా.. ఆపై ఔట్ స్వింగర్లు కూడా వేశాడు. బుమ్రా వేగం, లెంగ్త్ అద్భుతం. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ బుమ్రా. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే అతడు స్థిరంగా రాణింస్తున్నాడు. ఔట్ స్వింగర్లను నా లాగే వేస్తున్నాడు. కొన్నిసార్లు నన్ను మించిన నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడు’ అని అన్నాడు.
Also Read: Babar Azam Chat: బాబర్ అజామ్ ప్రైవేట్ చాట్ లీక్!
జస్ప్రీత్ బుమ్రా గాయంతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్‌లో సొంతగడ్డపై చివరిగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆపై వెన్ను గాయంకు శస్త్ర చికిత్స చేయించుకుని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. 2023 ఆగస్టు 18న ఐర్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన బుమ్రా.. సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన అతడు 14 వికెట్స్ పడగొట్టాడు. కీలక సమయంలో వికెట్స్ పడగొడుతూ జట్టుకు అద్భుత ఆరంభాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ బ్యాటర్లను తన పదునైన బంతులతో చెడుగుడు ఆడుకున్నాడు.