Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..

Baby Kidnapping

Baby Kidnapping

Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఈ నెల 21వ తేదీన అదృశ్యమైన నాలుగు నెలల చిన్నారి మిస్సింగ్ కేసును మట్టేవాడ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ ధార కవిత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీసీపీ వివరాల ప్రకారం.. చిన్నారి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, కన్నతల్లిదండ్రులే బిడ్డను విక్రయించినట్లు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు తల్లిదండ్రులు, మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

మధ్యవర్తుల సహాయంతో రూ. 2 లక్షల 90 వేలకు చిన్నారిని విక్రయించినట్లు తల్లిదండ్రులు అంగీకరించారు. వరంగల్ దేశాయిపేట సమీపంలోని లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న పిల్లలు లేని దంపతులకు ఈ చిన్నారిని అమ్మినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం డీసీపీ ధార కవిత చిన్నారిని ఐసీడీఎస్ (ICDS) అధికారులకు అప్పగించారు. ఈ శిశు విక్రయ వ్యవహారంలో తల్లిదండ్రులు, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో కలిపి మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.