విజయనగరం ఉగ్రకుట్ర లింకుల కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల ఉగ్రకుట్ర కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేశారు. సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. త్వరలోనే నిందితులు ఇద్దరినీ ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోనుంది. ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు విజయనగరం పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
విజయనగరంకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలం ఉన్న వారితో ఏర్పాటు చేసుకున్న సంబంధాలు, ఇతర కార్యకలాపాలపై ఎన్‌ఐఏ కొన్ని నెలలుగా కన్నేసి ఉంచింది. సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్‌తో కలిసి సిరాజ్ భారీ పేలుళ్ల కుట్రకు పథకం రూపొందించి.. అమలు చేసే దశలో దొరికిపోయాడు. మే 16న సిరాజ్, సమీర్‌లను విజయనగరం టూటౌట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఎన్‌ఐఏ, యాంటీ బాంబ్ స్క్వాడ్, మిగిలిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరంలో ఇద్దరినీ వారం రోజుల పాటు విచారించారు.
Also Read: Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!
గడువు ముగిసిన వెంటనే సిరాజ్, సమీర్‌లను కోర్టులో హాజరుపర్చగా.. మరోసారి రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి నుంచి సేకరించిన ఆధారాలపై ఇంకా లోతైన దర్యాప్తు అవసరమని ఎన్‌ఐఏ భావించింది. కేసును ఎన్‌ఐఏకు అప్పజెప్పాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలోని ఎన్‌ఐఏ అధికారులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ సహాయంతో పేలుళ్లకు సిరాజ్ ప్లాన్ చేశాడు. ఇమ్రాన్ పంపిన డబ్బులతో సిరాజ్ పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు.
