Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో మరణాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా.. ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్కు తయారీ ప్రక్రియలో ఉపయోగించే ఆర్గాన్ గ్యాస్‌తో పాటు ఇతర ప్రమాదకర వాయువుల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. SMS (స్టీల్ మెల్టింగ్ షాప్) యూనిట్‌లో ఆక్సిజన్ బ్లోయింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్గాన్ గ్యాస్ లీక్ కావడంతో రసాయనిక ప్రతిచర్య చోటుచేసుకుని భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
ఈ పేలుడు కారణంగా లాడిల్ (ద్రవ ఉక్కు నిల్వ చేసే భారీ పాత్ర) ఊడిపడటంతో సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కు ఒక్కసారిగా బయటకు పొంగిపడింది. దీంతో భారీ మంటలు చెలరేగి SMS యూనిట్‌లోని పలు భాగాలు దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఉష్ణోగ్రతలు 1,560 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి మానవ తప్పిదం కంటే నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) నుంచి వచ్చిన సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ రెండో రోజు కూడా ప్లాంట్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తోంది. మరోవైపు కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. నాణ్యత లేని లేదా లోపభూయిష్టమైన మెటీరియల్ వినియోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వారు అంటున్నారు. ఈ ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది.
ఇక ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నానికి చేరుకోనున్నారు. బాధితులను కలిసిన అనంతరం ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి ప్రమాద ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల అసలు కారణాలపై త్రిసభ్య కమిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన ప్రత్యేక నివేదికలు రానున్న రోజుల్లో వెలువడనున్నాయి. ఈ నివేదికలు ప్రమాదానికి బాధ్యులెవరు, భద్రతా లోపాలు ఎక్కడ జరిగాయి అనే అంశాలపై స్పష్టత ఇవ్వనున్నాయి.

