ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్‌ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఘటన మరువక ముందే.. మరో కిలాడి లేడీ తానో ట్రైని ఐఏఎస్ అధికారిని అంటూ హంగామా చేసింది. అంతేకాక తాను రాజకీయ నాయకుల బంధువునని కటింగ్‌లు కొట్టింది. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆగడాలతో పోలీసు వర్గాలకు టెన్షన్ పట్టుకుంది. అమృత భాగ్య రేఖ అనే మహిళ తన భర్తతో అనేక మోసాలకు పాల్పడుతున్నట్టు విశాఖపట్నం పోలీసులు గుర్తించారు.
నకిలీ ఐఏఎస్‌గా చెప్పుకుంటూ తిరుగుతున్న కిలాడి లేడీ కోసం విశాఖపట్నం పోలీసులు గాలిస్తున్నారు. డీసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలు ఆమె కోసం ఉత్తరాంధ్రలో ముమ్మురంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈమె అనేక ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని విశాఖ సీపీ శంఖ భ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటికే ఈమె బారిన పడిన ఇద్దరు బాధితులను గుర్తించామని, ఇంకా చాలా మంది మోసపోయినట్లు గుర్తించామని తెలిపారు. అయితే ఈమె వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీవీతో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ… ‘విశాఖలో నకిలీ ఐఏఎస్ అధికారిణిగా చలామణి అవుతున్న మహిళను గుర్తించాం. అమృత భాగ్య రేఖ అనే మహిళ, ఆమె భర్త తో కలిసి మోసాలు చేసినట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే ఇద్దరు బాధితులను గుర్తించాం. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పలు మోసాలు చేసినట్టు గుర్తించాం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. ఈమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి’ అని చెప్పారు.