విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా విశాఖలో నిర్వహించిన పట్టణ గృహ నిర్మాణశాఖ రీజినల్ వర్క్‌షాప్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొని.. నగర భవిష్యత్తును మార్చేయబోయే కీలక ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రధానంగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సెమీ రింగ్ రోడ్డు (Semi Ring Road) నిర్మాణమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ప్రస్తుతం లోతైన అధ్యయనం చేస్తోంది.
Also Read:Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..
ఈ రోడ్డు పూర్తయితే నగరం వెలుపలి నుంచి వచ్చే వాహనాలు నగరం లోపలికి రాకుండానే మళ్లించబడతాయి. దీనివల్ల నగరంలోని ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయి. నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి మంత్రి సానుకూలమైన అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఒకటి లేదా రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. పనులు ప్రారంభించిన మూడు సంవత్సరాల వ్యవధిలోనే విశాఖ వాసులకు మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Also Read:Hyderabad: అత్తాపూర్‌లో హైడ్రా ఉక్కుపాదం.. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..
వర్క్‌షాప్‌లో భాగంగా కేవలం రవాణా వ్యవస్థపైనే కాకుండా.. మున్సిపాలిటీల ఆర్థిక పరిపుష్టిపై కూడా మంత్రి చర్చించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కేవలం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకుండా.. తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో సెమీ రింగ్ రోడ్డు, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖలో జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా.. పెట్టుబడులకు కూడా నగరం స్వర్గధామంగా మారుతుంది. ప్రభుత్వం చూపిస్తున్న ఈ చొరవతో రాబోయే ఐదేళ్లలో విశాఖ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
