ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు కొందరు డిఫెన్స్‌లో పడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడుల మాటలు వాళ్ళలో పొలిటికల్ భరోసా కల్పించకపోగా… కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు ఫీలవుతున్నారా? సెల్ఫ్ డిఫెన్స్‌కు కూడా ఛాయిస్ లేకుండా పోతోందా? ఎవరా ఎమ్మెల్యేలు? వాళ్ళ భయం ఏంటి?
పవర్, పొజిషన్‌తో మైలేజ్ పాలిటిక్స్ చేద్దామనుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్ధితి అడకత్తెరలోపడినట్టే కనిపిస్తోంది. నేలనపోయే కష్టాలన్నీ వాళ్ళ నెత్తినెక్కి తాండవం చేస్తున్నాయా…. ? అని సొంత పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. అలా నలిగిపోతున్న నేతల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాస్, హోం మంత్రి అనిత, జనసేన ఎమ్మెల్యేలు వంశీ, విజయ్ కుమార్ ఉన్నట్టు చెబుతున్నారు. ఓవరాల్‌గా చూసినా… ఉత్తరాంధ్ర బీసీలకు అడ్డా కావడంతో ఇక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రభావం పార్టీల మీద బలంగా ఉంటుంది. అందులోనూ మత్స్యకార, యాదవ సామాజిక వర్గాల ఆదరణ పొందడం, అదే టెంపో కొనసాగించడం అంత తేలిక కాదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫిషర్‌మెన్ కమ్యూనిటీ ఆదరణ ఎంత బలంగా ఉంటే… ఆ స్ధాయిలో అందలం ఎక్కుతాయి పార్టీలు. అదే సమయంలో సేమ్ కమ్యూనిటీ… తేడా వస్తే ‘తెడ్డు’ తిరగేస్తుందన్న టెన్షన్ కూడా ఉంటుంది నేతలకు. కూటమి ఎమ్మెల్యేల విషయంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరగబోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఆదరించి నెత్తిన పెట్టుకున్న మత్స్యకారులు ఇక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తెడ్డు తిరగేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు కంగారు పెడుతున్నాయట. ఆ దిశగా ఎక్కువ ఇబ్బందిపడుతున్నది పల్లా, అనిత అన్నది స్థానిక రాజకీయవర్గాల మాట. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం ఇప్పుడు భారీ పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మారింది.
ఇక్కడ నిర్మిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగి ఉద్రిక్తతలు తలెత్తాయి. చర్చల తర్వాత సానుకూల పరిస్ధితులు కనిపించినా… సీఎం స్ధాయిలో హామీ ఇప్పించాలన్న ఫిషర్‌మెన్ కమిటీ డిమాండ్ విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని తెలుస్తోంది. మత్స్యకారుల ఆందోళనకు ఇప్పటికే వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో… రాజయ్యపేట కొత్త కార్యాచరణకు రెడీ అవుతోందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఇష్యూ గనక మళ్ళీ రాజుకుంటే హోం మంత్రికి ఖచ్చితంగా ప్రతికూల వాతావరణం తప్పదన్న అభిప్రాయం వుంది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లాశ్రీనివాస్ సక్సెస్ రేట్ ఎంత అనేదానికంటే…..గాజువాక ఎమ్మెల్యేగా ఆయన పరిస్థితి ముందు నుయ్యి …..వెనుక గొయ్యి అన్నట్టుగా మారిందట. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీతో గత ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన పల్లాకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయంటున్నారు. సుమారు లక్ష మంది జీవితాలతో ముడిపడిన అంశంలో ఇన్నాళ్ళు శాసనసభ్యుడు ఒక స్టాండ్ తీసుకోగా …. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలతో ఎటూ మాట్లాడలేని స్ధితికి వెళ్ళిపోయారనే చర్చ జరుగుతోంది. మత్స్యకారులు ఎక్కువగా నివశించే గంగవరం ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూ రగులుతూనే వుంది. అటు జనసేన ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ యాదవ్, సుందరపు విజయ్ కుమార్ కష్టాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. యలమంచిలి నియోజకవర్గంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామం అయిన పూడిమడక దగ్గర జెట్టీ నిర్మాణం హామీ పెండింగ్‌లో ఉంది. దీన్ని నెరవేర్చాలని స్ధానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఊళ్ళోకి వెళ్ళినఎమ్మెల్యేను నిర్బంధించినంత పని చేశారు స్ధానిక మత్స్యకారులు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రాబల్యం పెంచుకునేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. కానీ… సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి బలమైన మత్స్యకార వర్గం నుంచి ఆశించిన స్ధాయిలో సహకారం లభించడం లేదని చెప్పుకుంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో అరెస్ట్ అయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎండగట్టేస్తోంది. బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయంతో పాటు వీలైనంత వరకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన మాటలు బలంగానే వెళ్ళాయి. ఎమ్మెల్యే అసలు ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని కూటమి నేతలే ఆక్షేపిస్తున్న పరిస్ధితి. ఇక, యాదవ సామాజిక వర్గం ఎక్కువగా వుంటే విశాఖ అర్బన్‌లో సంక్షేమ భవనం భూమి వ్యవహారం వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది.
ఎమ్మెల్యేలు పల్లా, వంశీ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా… పొజిషన్లో వుండి కూడా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు ఆపలేకపోతున్నారన్న చర్చను యాదవుల్లో లేవదీయడంలో వైసీపీ కొంతమేక సక్సెస్ అయింది. భవనం కోసం ఎండాడ నేషనల్ హైవే మీద గత ప్రభుత్వం స్ధలం కేటాయించి….శంకుస్ధాపన కూడా పూర్తి చేస్తే….కూటమి సర్కార్ దాన్ని రద్దు చేయడమే వివాదానికి అసలు కారణం. ప్రత్యామ్నాయంగా ముడసర్లోవ దగ్గర భూమి ఇచ్చినా… అందుకు యాదవులు సిద్ధంగా లేరట. ఇలా, కీలకమైన రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన సున్నితమైన అంశాలను హ్యాండిల్ చేయడం సిట్టింగులకు సమస్యగా మారుతోంది. గొడవ రేగినప్పుడల్లా…. తాత్కాలికంగా సర్దిచెబుతున్నా… వైసీపీ ఎప్పటికప్పుడు రచ్చబండ పెట్టి మరీ కడిగిపాడేస్తుండటంతో కూటమి ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నది విశాఖ టాక్. అటు అధిష్టానాన్ని ఒప్పించలేక, ఇటు నియోజకవర్గ ప్రజలకు సర్ది చెప్పలేక సతమతం అవుతున్నారట. అదే సమయంలో విశాఖను సాఫ్ట్‌వేర్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు, పెట్టుబడులు ఎలాఉన్నా… నియోజకవర్గ స్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది విశాఖ కూటమి ఎమ్మెల్యేల కంగారు.
