BJP: విశాఖ డెయిరీ పాలక వర్గం బీజేపీలో చేరింది. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో డెయిరీ ఛైర్మన్ ఆడారీ ఆనంద్‌తో పాటు డైరెక్టర్లు యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి బీజేపీ కండువాలను కప్పుకున్నారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. వారి తండ్రి తో మా నాన్నకు అవినాభావ సంబంధం ఉందన్నారు. పార్టీలోకి వచ్చిన తరువాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ పేర్కొన్నారు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 11వ ఆర్థిక శక్తి గా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోడీ తీర్చిదిద్దారన్నారు. అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానించారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్‌కు భారత్ రత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేద్కర్‌ను అవమానించారని అన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ట్రైబల్ మహిళను రాష్ట్రపతి చేసిన బీజేపీ.. మహిళలను ఎంతగా గౌరవిస్తుందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు.
స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారని.. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. చిటికెడు మట్టి కూడా గత ప్రభుత్వం విదల్చలేదని విమర్శించారు. రాష్ట్రానికి పన్ను రాయితీలు, అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాక్షస విధ్వంసకర పాలన చూశామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు.