NTV Telugu Site icon

Team India: టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్‌ లేడు: సెహ్వాగ్

Virender Sehwag

Virender Sehwag

ప్రస్తుతం భారత్‌లో ఒక్క నాణ్యమైన స్పిన్నర్‌ లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. భారత్‌ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్నర్లు బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటర్లు సరిగ్గా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడంపై సెహ్వాగ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు అందరూ స్పిన్‌కు దాసోహమమైన విషయం తెలిసిందే.

వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘భారతదేశం నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి ప్రధాన కారణం వైట్ బాల్ క్రికెట్‌ ఎక్కువగా ఆడటమే. టీ20ల్లో 24 బంతులను మాత్రమే వేస్తారు. దీంతో బంతిని ఫ్లైట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి బ్యాటర్లను ఔట్ చేసే నైపుణ్యంను సాధించలేరు. ఇక భారత క్రికెటర్లూ అతి తక్కువగానే దేశవాళీలో ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కంటే డొమిస్టిక్‌లోనే ఎక్కువ స్పిన్‌ను ఆడే అవకాశం దొరుకుతుంది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్‌ బెస్ట్’ అని అన్నాడు.

Also Read: KBC 16: ఒలింపిక్స్‌పై ప్రశ్న.. కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ కొద్దిలో మిస్‌ అయిన ఆదివాసీ!

‘మా కాలంలో ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, యువరాజ్.. మేమంతా దేశవాళీ క్రికెట్ కూడా ఆడేవాళ్లం. వన్డే లేదా నాలుగు రోజుల క్రికెట్ అయినా ఆడాం. మాకు చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు దేశవాళీ క్రికెట్ బాగా ఉపయోగపడేది. ప్రస్తుతం ఆటగాళ్లకు వేర్వేరు లీగ్‌లు ఉన్నాయి. బిజీ షెడ్యూల్‌తో దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం ఉండటం లేదు. ప్రస్తుత టీమ్‌లో నాణ్యమైన స్పిన్‌ బౌలర్లు లేరనేది నా అభిప్రాయం. బంతిని ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారు’ అని వీరూ తెలిపాడు.