Jessica Head: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య హీట్ మూమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కేవలం ఆటగాళ్ల వరకే పరిమితం కాకుండా, ట్రావిస్ హెడ్ కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఆర్సీబీని మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 11 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసిన సమయంలో ట్రావిస్ హెడ్ తో కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో స్పష్టత లేకపోయినా, మైదానంలో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అంతేకాదు.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ వివాదం కొనసాగింది. ఆట ముగిసిన తర్వాత ట్రావిస్ హెడ్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా.. కోహ్లీ మాత్రం పాట్ కమిన్స్, అభిషేక్ శర్మలకు షేక్ హ్యాండ్ ఇచ్చి హెడ్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అయితే ఆ తర్వాత ఓ వర్గానికి చెందిన అభిమానులు ట్రావిస్ హెడ్, అతని భార్య జెస్సికాపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా వారి మూడు సంవత్సరాల క్రితం జరిగిన పెళ్లి ఫోటోపై అసభ్యకర సందేశాలు, బెదిరింపులు పోస్టు చేసినట్లు సమాచారం. కొందరు కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగుతూ దారుణమైన మెసేజ్లు పంపినట్లు సమాచారం.
ఈ విషయంపై స్పందించిన జెస్సికా హెడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇందులో “వరల్డ్ కప్ తర్వాత ఎదురైన వేధింపులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఉదయం లేచేసరికి సోషల్ మీడియా అంతా దూషణలతో నిండిపోయింది. మేము బాగానే ఉన్నాం.. కానీ, మా కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా టార్గెట్ చేస్తున్నారు” అని ఆమె ఆస్ట్రేలియన్ మీడియాతో తన గోడును వెళ్లబుచ్చుకుందది.
అంతేకాకుండా ఇది మొదటిసారి కాదని కూడా జెస్సికా తెలిపింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించిన తర్వాత కూడా తన కుటుంబానికి అత్యంత దారుణమైన బెదిరింపులు వచ్చాయని వెల్లడించింది. 2024 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతి క్రీడలో మానసిక ఆరోగ్యంపై చర్చ చాలా అవసరం. క్రీడలపై అభిమానం ఉండొచ్చు కానీ ఆటగాళ్ల వెనుక కుటుంబాలు, భావోద్వేగాలు ఉన్న మనుషులు ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకరిపై ఒకరు మరింత గౌరవంగా, దయతో ప్రవర్తించాలని జెస్సికా పేర్కొంది.
అయితే ట్రావిస్ హెడ్ మాత్రం ఈ వేధింపులపై అధికారికంగా స్పందించలేదు. కాకపోతే మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “Keep the body guessing” అంటూ పోస్ట్ పెట్టాడు. ఇది కోహ్లీతో జరిగిన ఘటనకే సంబంధించినదా అనే దానిపై అభిమానుల్లో చర్చ ఇంకా కొనసాగుతోంది.
