Virat Kohli vs Pakistan: అది 2022 ఏడాది. టీ20 ప్రపంచకప్‌లో ఇదే రోజు (అక్టోబర్ 23) క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ జరిగింది. భారత్-పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ పోరులో విరాట్ కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఓ దశలో విన్ ప్రిడిక్టర్ కూడా భారత్ గెలిచే అవకాశాలు కేవలం 3.1 శాతమేనని చూపించినా.. కోహ్లీ మాత్రం అది ముమ్మాటికీ తప్పని నిరూపించాడు.
ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అయితే భారత్‌కు లక్ష్యం పెద్దదిగా కనిపించకపోయినా.. ఛేదన ఆరంభం మాత్రం ఘోరంగా సాగింది. నసీమ్ షా కెఎల్ రాహుల్‌ను ఔట్ చేయగా, హారిస్ రౌఫ్ కెప్టెన్ రోహిత్ శర్మ, అప్పటి నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా రనౌట్ కావడంతో భారత్ కేవలం 6.1 ఓవర్లలో 31/4కు కుప్పకూలింది.
ఆ సమయంలో విన్ ప్రిడిక్టర్ భారత్ ఓటమిని దాదాపుగా ఖరారు చేసేసింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మాత్రం తన ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. ఫామ్ కోసం ఇబ్బందులు పడుతున్న కోహ్లీకి హార్దిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరూ మొదట ఆచితూచి ఆడుతూ.. వికెట్లను చేజారకుండా కాపాడుకున్నారు. క్రమంగా భాగస్వామ్యం బలపడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. హార్దిక్ పాండ్యా బౌండరీలతో వేగం పెంచగా.. కోహ్లీ కూడా తన అసలు రూపాన్ని చూపించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఆ సమయానికి కోహ్లీ 47 బంతుల్లో 61 పరుగులు, పాండ్యా 33 బంతుల్లో 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా భారీ పరుగులు అవసరమైనా.. మ్యాచ్ నెమ్మదిగా భారత్ వైపు మళ్లుతోంది.
అప్పుడు అసలైన కథ మొదలైంది. 19వ ఓవర్‌లో హారిస్ రౌఫ్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి. దీంతో పాకిస్థాన్ విజయం అందరూ ఖాయమనే అనుకున్నారు. అయితే ఐదో బంతికి కోహ్లీ రౌఫ్ బౌలింగ్‌లో నేరుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతినీ ఫ్లిక్ చేస్తూ సిక్సర్‌గా మలిచాడు. వరుస రెండు సిక్సర్లతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ చేతుల్లోకి వచ్చింది. 19వ ఓవర్ తర్వాత పాకిస్థాన్‌కు చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ ఓవర్‌కు స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను బాబర్ ఆజం ఉపయోగించాడు.
ఆ ఓవర్ లో మరో ట్విస్ట్ వచ్చింది. తొలి బంతికే హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత నో-బాల్‌పై కోహ్లీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఫ్రీ హిట్‌పై మూడు పరుగులు తీశారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ స్టంప్ అవుట్ కాగా.. చివరి బంతికి అశ్విన్ బంతిని తెలివిగా వదిలేయడంతో వైడ్ వచ్చింది. ఇక చివరగా అశ్విన్ ఒక పరుగు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులతో పాకిస్థాన్ అభిమానులకు కాళరాత్రి మిగిల్చాడు. మ్యాచ్ఈ అనంతరం ఇన్నింగ్స్‌ను తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ను అంత లోతుగా తీసుకెళ్లడం ఎంతో ముఖ్యమని, కోహ్లీ-పాండ్యా భాగస్వామ్యం మ్యాచ్‌ను మార్చిన కీలక ఘట్టమని అన్నాడు. భారత్ గెలిచే స్థితిలో లేకపోయినా.. కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడని ప్రశంసించాడు.
THE GREATEST EVER T20 WORLD CUP MATCH PLAYED ON THIS DAY 3 YEARS AGO.
– King Kohli stole the show with his unbelievable 82* (53). 🐐 https://t.co/IoP3lD8Zd0
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2026

