టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు. విరాట్ అప్పుడే రిటైర్‌మెంట్ ఇవ్వాల్సింది కాదని, మరికొన్ని సంవత్సరాలు ఆడాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. విరాట్ ఉన్నపళంగా వీడ్కోలు పలకడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా చుస్తున్నారు. రిటైర్‌మెంట్ నేపథ్యంలో విరాట్ టీ20, టెస్ట్ కెరీర్ స్టాట్స్ ఓసారి చూద్దాం.
2008లో దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా 12 పరుగులు చేశాడు. 2010లో సురేష్ రైనా కెప్టెన్సీలో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లో 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కింగ్ టెస్ట్ అరంగేట్రం జూన్ 2011లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. చివరి టెస్ట్ జనవరి 2025లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై ఆడాడు. చివరి టెస్ట్‌లో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ ఘనంగా ముగిసింది. మంచి ఫామ్, అందులోనూ టీ20 ప్రపంచకప్ గెలవడంతో అందరూ వీడ్కోలును ఆనందించారు. అయితే టెస్ట్ రిటైర్‌మెంట్ టీ20 మాదిరి ముగియలేదు. గత 5 సంవత్సరాలలో విరాట్ ఆట పేలవంగా ఉంది. ఈ ఐదేళ్లలో ఒకే ఒక సెంచరీ చేశాడు. ఇక కోహ్లీ సగటు 54 నుండి 46కి పడిపోయింది. ఇటీవల న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కింగ్ పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. రెండు సిరీస్‌లో ఆఫ్ స్టంప్ బంతులను వెంటాడి తన బలహీనతను బయటపెట్టాడు. న్యూజిలాండ్‌పై 3 టెస్ట్ మ్యాచ్‌లలో 15.50 సగటుతో 93 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఒత్తిడి, పరిణామాల ఫలితమే 36 ఏళ్ల విరాట్ రిటైర్‌మెంట్‌కు కారణం అని చెప్పొచ్చు.
విరాట్ కోహ్లీ టీ20 కెరీర్:
* 125 టీ20లు, 117 ఇన్నింగ్స్‌లు, 4188 పరుగులు, 48.69 సగటు
* 1 సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 4 వికెట్లు
* 369 ఫోర్లు, 124 సిక్సర్లు
విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్:
* 123 టెస్టులు, 210 ఇన్నింగ్స్‌లు, 9230 పరుగులు, 46.85 సగటు
* 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు, 55.57 స్ట్రైక్ రేట్
* 1027 ఫోర్లు, 30 సిక్సర్లు
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్:
* 302 వన్డేలు, 290 ఇన్నింగ్స్‌లు, 14181 పరుగులు, 57.88 సగటు
* 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు, 5 వికెట్లు, 93.34 స్ట్రైక్ రేట్
* 1325 ఫోర్లు, 152 సిక్సర్లు
