Site icon NTV Telugu

Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Test Retirement

Virat Kohli Test Retirement

టీమిండియా క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. భారత స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమేరకు కాసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ చేశాడు. గత వారమే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దాంతో రోహిత్‌, కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్‌తో భారత్ టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. రోహిత్‌, కోహ్లీలు ఒకేసారి టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు భారత వన్డే జట్టులో మాత్రమే కనిపించనున్నారు. ఇద్దరు దిగ్గజాలు వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి.

‘టెస్ట్ క్రికెట్‌లో నేను తొలిసారి భారత జెర్సీ ధరించి 14 సంవత్సరాలు అయింది. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ ఫార్మాట్ నన్ను ఇంతదూరం తీసుకెళ్తుందని ఎప్పుడూ ఊహించలేదు. టెస్ట్ క్రికెట్ నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, జీవితానికి సరిపడా పాఠాలు నేర్పింది. వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కన్పించని చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి’ అని విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశాడు.

‘టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలగడం అంత సులువు కాదు. కానీ నా నిర్ణయం సరైనదిగా అనిపిస్తుంది. ఈ ఫార్మాట్‌ కోసం నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చా. నేను ఆశించిన దాని కంటే ఎక్కువే నాకు తిరిగిచ్చింది. ఆట, నా సహచరులు, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు. నా మనసు నిండా సంతృప్తితో వైదొలుగుతున్నా. నా టెస్టు కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. 269 సైనింగ్‌ ఆఫ్‌’ అంటూ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. 123 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Exit mobile version