NTV Telugu Site icon

Ranji Trophy 2024: ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్ పేర్లు.. కష్టమే సుమీ!

Virat Kohli, Rishabh Pant

Virat Kohli, Rishabh Pant

Virat Kohli Name in Delhi Squad for Ranji Trophy 2024: అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్‌ను చండీగఢ్‌తో ఆడనుంది. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్ నవ్‌దీప్‌ సైనీ కూడా చోటు దక్కించుకున్నాడు. గత సీజన్‌లో ఆడిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఈసారి చోటు దక్కలేదు.

ఢిల్లీ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు సెప్టెంబర్ 26న ఫిట్‌నెస్ పరీక్షలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న క్రికెటర్లకు ఫిట్‌నెస్ టెస్టు నుంచి మినహాయింపు ఉంది. అంటే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇద్దరు ఢిల్లీ జట్టులో ఉన్నా.. రంజీ ట్రోఫీలో ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఉంది. కోహ్లీ, పంత్‌లు తుది జట్టులో ఉంటారు. ఈ సిరీస్‌ అనంతరం కొద్దిరోజులకే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్య ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగడం సాధ్యం కాదు.

Also Read: Jasprit Bumrah: కాన్పూర్‌ టెస్ట్.. జస్ప్రీత్ బుమ్రా దూరం! తుది జట్టులోకి కుల్దీప్

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఆడాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ అవ్వడంతో రంజీ ట్రోఫీలో ఆడే సమయం దొరకలేదు. రిషబ్ పంత్‌ 2016-17 సీజన్‌లో చివరగా ఆడాడు. ఝార్ఖండ్‌పై 48 బంతుల్లో సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్‌లలో కీపర్‌గా బిజీ కావడంతో రంజీలో బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకున్న పంత్.. ఇటీవల దులీప్‌ ట్రోఫీలో ఆడిన విషయం తెలిసిందే. వీరు మాత్రమే కాదు చాలా మందికి అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ కారణంగా.. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం సాధ్యపడటం లేదు.